2028లో మళ్లీ కేసీఆరే సీఎం..: కేటీఆర్

Must read

వికారాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 2028లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చి కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు.

జ్వరం ఉన్నప్పటికీ వికారాబాద్ ప్రజలను కలిసేందుకు వచ్చానని కేటీఆర్ తెలిపారు. వికారాబాద్ గాలి, నీరు, ప్రకృతి ఔషధాల వంటివని, ఇది రాష్ట్రంలో అద్భుతమైన పర్యాటక ప్రాంతమని కొనియాడారు. వికారాబాద్ అభివృద్ధికి మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఎంతో కృషి చేశారని, అలాంటి నాయకుడిని ప్రజలు కోల్పోయారని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ అప్పులు చేసి వెళ్లారని ప్రచారం చేస్తోందని, కానీ పార్లమెంట్‌లో వెల్లడైన లెక్కల ప్రకారం కేసీఆర్ పాలనలో రాష్ట్ర అప్పులు రూ.2.80 లక్షల కోట్ల మేర మాత్రమే పెరిగాయని చెప్పారు. ఆ అప్పులతోనే మెడికల్ కాలేజీలు, గురుకులాలు, సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు అమలు చేశారని పేర్కొన్నారు.

కేసీఆర్ హయాంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌, రైతుబంధు, రుణమాఫీ వంటి పథకాలు సకాలంలో అందేవని, ఇప్పుడు రైతులు ఎరువులు, విద్యుత్ కోసం ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. రైతుబంధు కొనసాగిస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు ఆ పథకాన్ని నిలిపివేసిందని విమర్శించారు.

వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లు గడిచినా ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించి అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు ప్రజలు వారి వైఫల్యాలను గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు.

దామగుండంలో నేవీ రాడార్ కోసం 2,900 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అప్పగించిందని కేటీఆర్ ఆరోపించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 12 లక్షల చెట్లు నరుకుతారని ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వలేదని చెప్పారు. అలాగే మూసీ అభివృద్ధి పేరుతో కూడా చెట్లను నరుకుతున్నారని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు.

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం 90 శాతం వరకు పూర్తి చేసిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్దేశపూర్వకంగా ఆ ప్రాజెక్టును పక్కన పెట్టిందని అన్నారు. ఆ ప్రాజెక్టు పూర్తయితే కేసీఆర్‌కు పేరు వస్తుందనే కారణంతోనే పనులు నిలిపివేశారని ఆరోపించారు.

శాసనసభ స్పీకర్ వ్యవహారశైలిపైనా కేటీఆర్ విమర్శలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడం లేదని, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారు తటస్థంగా వ్యవహరించాలని సూచించారు. పోలీసులు విధులు నిర్వర్తించాలే తప్ప అధికార పార్టీ కోసం అతిగా వ్యవహరించవద్దని హెచ్చరించారు.

వికారాబాద్ నియోజకవర్గంలోని ప్రతి పోలింగ్ బూత్‌లో పార్టీ కమిటీలను బలోపేతం చేయాలని, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. గులాబీ జెండాను మళ్లీ ఎగురవేసి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణను అభివృద్ధి బాటలో నడిపిద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!