శనివారం ఉదయం వీక్షణం 166వ సమావేశం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. మొదట వీక్షణం సంస్థ అధ్యక్షురాలు స్వీయ పరిచయ కవులు రామాయణం ప్రసాదరావు మరియు ఉప్పలపాటి వెంకటరత్నం గార్లను మరియు సమావేశంలో పాల్గొన్న కవులకు, కవియిత్రులకు మరియు ఇతర సాహిత్య అభిమానులకు స్వాగతం పలికి సభను ప్రారంభించారు.
మొదట కావలి కవి రామాయణం ప్రసాదరావు ఒక ప్రార్థనా గీతంతోతన ప్రసంగాన్ని ప్రారంభించి తన చిన్ననాటి విద్యావిధానం తనను సారస్వత ము వైపు ఎలా ఆకర్షించిందో తెలిపారు. ఆతరువాత ప్రఖ్యాత రచయితల రచనలు తనను ఎలా ప్రభావితం చేశాయో తెలిపారు.తన గురువుగారైన. శ్రీరామ్ వెంకట భుజంగరాయ శర్మతో అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. తరువాత నాటకాల్లో తన అనుభవాన్నీ మహా రంగస్థల నటులతో పరిచయాలను జ్ఞప్తి చేసుకున్నారు. అలాగే మార్ధంగకునిగా, తబలిస్టీగా తన అనుభవాన్నీ చెప్పుకున్నారు. సాహిత్యంలో తనగురువుగా జంధ్యాల అన్నపూర్ణ నూటం కించారు.తను వ్రాసిన పుస్తకాలను ,తనకు వచ్చిన పురస్కారాలను తెలిపారు
తరువాతి ప్రాసంగీకులు శ్రీ వెంకటరత్నం తనకూ నాటకాలలో గల ప్రావీణ్యతను, రచయిత హరనాథరావు, సినీ దర్శకులు టి.కృష్ణతో పరిచయాన్ని నెమరు వేసుకున్నారు. ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు తనను చిన్నతనంలో ఎత్తుకున్న విషయాన్ని జ్ఞప్తి చేసుకుని మురిసిపోయారు. సాహిత్యంలో వారు చేసిన విశిష్టమైన ప్రక్రియలను చెప్పి అందరినీ ముగ్ధులను చేశారు. ఈ వయసులో కూడా తాను వేణువు నేర్చుకుంటున్నానని తెలిపినపుడు చప్పట్లు మ్రోగాయి. ఇప్పుడు కూడా వారు చేస్తున్న వివిధ సాహితీ సేవలను, కార్యక్రమాలు మమ్ము అబ్బుర పరిచాయి. ఈ రెండు ప్రసంగాలనూ కవులందరూ శ్రద్ధగా విని ప్రశంసలు కురిపించారు.ఈ నూతన ప్రక్రియకు అందరూ ఫిదా అయ్యారు!
పిమ్మట వీక్షణం భారతదేశ ప్రతినిధి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, కవిసమ్మేళన సామ్రాట్ డాక్టర్ రాధా కుసుమ సంయుక్త ఆధ్వర్యంలో కవిసమ్మేళనం జరిగింది. మొదట డాక్టర్ గీతా మాధవి రైలుబండి రాగం అనే కవితను చదివి అందరికీ బాల్యపు ఙ్ఞాపకాలను గుర్తుచేశారు. అమెరికా కవి కొత్తూరి వెంకట్ ఏడుకొండలస్వామి పద్యాలను, గంటా మనోహరరెడ్డి ఘంటారావం మినీ కవితలను, డాక్టర్ చీదెళ్ళ సీతాలక్ష్మి చిక్కుల్లో తిండి కవితను, పరిమి వెంకట సత్యమూర్తి అవినీతిని అడ్డ్రస్సులేకుండా చేద్దాం అనే కవితను, అయ్యల సోమయాజుల ప్రసాద్ పితృదేవులు పరమేశ్వరులు అనే కవితను, ముప్పాళ్ళ భవాని హారతి పాటను, మేడ్చల్ కవి డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు అనంతావతారం కవితను, బాల సాహిత్య కవయిత్రి డాక్టర్ కందేపి రాణిప్రసాద్ ఆమె యుద్ధం అనే కవితను, డాక్టర్ కోదాటి అరుణ రైతన్నల వ్యధ అనే హృదయ విచారకర కవితను, శ్రీలతా ధవన్ అనుభవాలు – అవగాహన కవితను చదివి అందరినీ అలరించారు.
ఒంగోలు కవి నాగేంద్రమ్మ చుక్కల్లో చంద్రుడు అనే గురజాడ అప్పారావు పై కవితను, రామాయణం ప్రసాదరావు ఓ కవీ అనే కవితను, ఉప్పలపాటి వెంకటరత్నం జారుడు మెట్లు అనే కవితను, మోటూరి నారాయణరావు మళ్ళీ గాయపరచవుకదా అనే కవితను, గాయకురాలు బలుసాని వనజ పితృదేవోభవ కవితను, అమీనా కలందర్ అమ్మా నువ్వు లేని నేను రాజ్యంలేని రాణినే అనే కవితను, కాకర్ల రమణయ్య ప్లాస్టిక్ భూతం కవితను, డాక్టర్ రాధా కుసుమ నేటి దృశ్యం అనే కవితను, భోగెల ఉమామహేశ్వరరావు నాన్నపై కవితను చదివి పాల్గొన్న కవిమిత్రులను ఆకట్టుకున్నారు. చివరగా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ కవితలు విన్న తర్వాత తెలుగు వెలుగైందని, మధురమైందని, గానమైందని, ప్రాణమైందని, రక్తమైందని, ఊపిరైందని, వర్షమైందని, మంత్రమైందని, కవితైందని, తల్లైందని అవేశంగా హావ భావాలతో ఆలపించి సభికులందరి మన్ననలు పొందారు.
సభాధ్యక్షురాలు సమావేశాన్ని చక్కగా నిర్వహించటంలో సహకరించిన స్వీయ పరిచయకర్తలు ఇద్దరికీ, కవి సమ్మేళన నిర్వహించిన ఇద్దరికీ మరియు చక్కని కవితలు వినిపించిన కవులకు ధన్యవాదాలు తెలిపి డాక్టర్ గీతా మాధవి కార్యక్రమాన్ని ముగించారు. చక్కని సాహిత్య సమావేశం నిర్వహించినందుకు సాహిత్యాభిమానులు వీక్షణం నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపి వచ్చేనెల సమావేశాం కొరకు ఎదురుచూస్తుంటామని చెప్పారు.గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, వీక్షణం భారతీయ ప్రతినిధి.





