పొగాకు రైతుల ప్రయోజనాలను కాపాడడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యతని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మార్కెట్లో పొగాకు రకం ఏదైనా కిలో రూ.200 కంటే తగ్గడానికి వీల్లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో పొగాకు రైతులు, ట్రేడర్లతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించి పొగాకు ధరలపై సమీక్షించారు.
రైతులు,ట్రేడర్ల సమస్యలను తెలుసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పొగాకు రైతులను ఆదుకునేందుకు ట్రేడర్లు, కొనుగోళ్ల కంపెనీలు నూటికి నూరు శాతం మానవీయ కోణంలో రైతులకు సహకరించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పొగాకు వేలం కేంద్రాల్లో నో బిడ్, లో బిడ్ అనే మాటలకు తావుండకూడదన్నారు.
రైతులు మార్కెట్టుకు తెచ్చిన పొగాకు బేళ్లను వెనక్కి పంపే పరిస్థితులు అస్సలు ఉండకూడదని చెప్పారు. మార్కెట్లోకి వచ్చిన పొగాకును కంపెనీలు కొనుగోలు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. దీనికి అనుగుణంగా అన్ని పొగాకు వేలం ప్లాట్‌ఫారమ్‌లను పూర్తి స్థాయిలో ప్రారంభించాలని చేయాలని ఆదేశించారు. అలాగే పొగాకు కంపెనీలన్నీ తప్పనిసరిగా కొనుగోళ్లు చేపట్టాలని ఏ ఒక్క కంపెనీ కూడా వెనక్కు వెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేశారు.
టొబాకో బోర్డ్ పరిధిలో కాకుండా అనధికారికంగా కొనుగోళ్లు జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని… అవసరమైతే అరెస్టులు చేస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. తనకు రైతుల ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి ఈ ఏడాది పొగాకు ట్రేడర్లు, కంపెనీలు ప్రభుత్వానికి, రైతులకు సహకరించాలని కోరారు. రాబోయే ఏడాది నుంచి మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు సిద్దం చేస్తామని, ప్రత్యామ్నాయ పంటలను ప్రొత్సహిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.
అలాగే పొగాకు మార్కెట్ స్థిరీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తుందన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని చెప్పారు. రైతులు, టొబాకో బోర్టు ప్రతినిధులను వెంట పెట్టుకుని ఢిల్లీ వెళ్లి సంబంధిత మంత్రులు, అధికారులను కలవాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడును సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ఈ సమావేశంలో మంత్రులు అచ్చెన్నాయుడు, ఆనం రాం నారాయణ రెడ్డి, గొట్టిపాటి రవి కుమార్, డీవీబీ స్వామి, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, టొబాకో బోర్డ్ ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.





