ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతుతో ముందుకు సాగుతోందని కేంద్ర మంత్రి ప్రహ్లద్ జోషీ స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధి కోసం ఇప్పటికే వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించామని, భవిష్యత్తులో కూడా అవసరమైన సహకారం కొనసాగుతుందని ఆయన తెలిపారు. విజయవాడలో నిర్వహించిన ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
విజయవాడ వన్‌టౌన్ ప్రాంతంలోని వాజ్ పాయి పార్క్ లో జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా చీపురు పట్టి పార్క్ పరిసరాలను శుభ్రం చేసి శుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. పరిశుభ్రమైన సమాజ నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు P. V. N. మాధవ్, ఎమ్మెల్యే Y. సుజనా చౌదరి తదితర నాయకులు పాల్గొన్నారు. శుభ్రత కార్యక్రమం అనంతరం వారు పార్క్ ప్రాంగణంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ మద్దతు తెలిపారు. పచ్చదనం పెంపొందించడం ద్వారా భవిష్యత్ తరాలకు మెరుగైన వాతావరణాన్ని అందించవచ్చని పేర్కొన్నారు.
అనంతరం అక్కడికి వచ్చిన వాకర్స్, స్థానిక ప్రజలతో కేంద్ర మంత్రి ‘చాయ్ పే చర్చ’ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల విస్తరణ, డిజిటల్ ఇండియా, స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాల గురించి వివరించారు. దేశ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కూడా కీలకమని ఆయన చెప్పారు.
ఈ సందర్భంగా అమరావతి రాజధాని నిర్మాణంపై మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.15,000 కోట్ల నిధులను కేటాయించిందని ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. అంతేకాకుండా హౌసింగ్ అండ్ అర్బన్ డవలప్ మెంట్ కార్పోరేషన్ (హడ్కో) ద్వారా మరో రూ.11,000 కోట్ల ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. ఈ నిధులు అమరావతి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు.
అమరావతి కేవలం ఆంధ్రప్రదేశ్ రాజధాని మాత్రమే కాకుండా, భవిష్యత్తులో దేశంలో అత్యంత ఆధునిక నగరాల్లో ఒకటిగా అవతరించే సామర్థ్యం కలిగి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రాజధాని ప్రాంతంలో రహదారులు, ప్రభుత్వ భవనాలు, నీటి సరఫరా, విద్యుత్, రవాణా వ్యవస్థలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు.
రాజధాని ప్రాంతానికి రవాణా సదుపాయాలను మరింత బలోపేతం చేయడంపై కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి చెప్పారు. అమరావతికి ప్రత్యేక రైల్వే లైన్ ఏర్పాటు దిశగా చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అలాగే జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు, అంతర్గత రోడ్ల అభివృద్ధి ద్వారా రాజధాని ప్రాంతానికి అత్యుత్తమ కనెక్టివిటీ కల్పిస్తున్నట్లు తెలిపారు.
పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపుకు మెరుగైన రవాణా వ్యవస్థ కీలకమని ఆయన అన్నారు. అమరావతి అభివృద్ధి చెందితే మొత్తం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు వస్తుందని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ, దేశవ్యాప్తంగా పరిశుభ్రత ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చిన ఘనత ప్రధాని నకేంద్రమోదికి దక్కుతుందని ప్రహ్లాద్ జోషి అన్నారు. గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉండటం ప్రజారోగ్యానికి ఎంతో అవసరమని చెప్పారు.
స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, నగరాల ఆధునీకరణ వంటి అంశాలను కేంద్ర ప్రభుత్వం సమాంతరంగా ముందుకు తీసుకెళ్తోందని ఆయన వివరించారు. ప్రజలు కూడా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చొరవ చూపాలని పిలుపునిచ్చారు.




