లోకం కనులకు కాంతులు పంచే చిత్రపటం,
ప్రతి దృశ్యం ఒక కథ,
ప్రతి క్షణం ఒక సందేశం
లోకం వీనులకు విందులు అందించే సంగీతమందిరం,
గాలుల గుసగుసలు, పక్షుల కిలకిలరావాలు,
మనసును మురిపించే మధురస్వరాలు
లోకం రంగుల కలలకు పిలిచే ఆహ్వానపత్రం,
కొత్త మార్గాలను పరిచయం చేయటం,
కుతూహలాలకు రెక్కలు తొడగటం ధ్యేయం
లోకం నిద్రించిన ఆశల మేల్కొలుపు గీతం,
పడిపోయిన అడుగులను లేవదీసి,
ముందుకు సాగమని ప్రేరేపించే మార్గదర్శి
లోకం ప్రకృతి ప్రసాదాల పంచిపెట్టే పుణ్యక్షేత్రం,
ఆకలి తీర్చే అన్నపూర్ణ,
అందరికీ ఆత్మీయత అందించే అమృతవల్లీ
లోకం — కొండలు, కోనలు, నదుల సమూహం,
అనుభవాల ఆణిముత్యాలను అందించి,
జీవితాన్ని సార్థకం చేయించే స్థావరం
లోకం హృదయాలకు హృదయాలను కలిపే సేతకం,
స్నేహం, అనురాగం, ఆప్యాయతల నిలయం,
మనిషితనాన్ని పరిమళింపజేసే ఉద్యానవనం
లోకం బాధలో భుజం తడుతుంది,
సంతోషంలో చిరునవ్వు పంచుతుంది,
సహజీవన సౌందర్యాన్ని చాటుతుంది
అయితే లోకం అంతా ఇదే కాదు
నవ్వుల్లో కన్నీళ్లు దాగుంటాయి, వెలుగుల్లో నీడలు చేరుతాయి,
విజయాల వెనుక వైఫల్యాలు నిలుస్తాయి
అందుకే లోకం కనబడినదంతా నిజం కాదని,
వినబడినదంతా సత్యం కాదని, అనుభవమే అసలైన గురువని,
అడుగడుగునా బోధించే అద్భుత జీవన విశ్వవిద్యాలయం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.





