ఆఫ్ఘనిస్థాన్ వన్డే సిరీస్‌కు కోహ్లీ దూరం?

Must read


ఆఫ్ఘనిస్థాన్‌తో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌కు ముందు భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. భారత స్టార్ బ్యాటర్ విరాట్​ కోహ్లీ తొడ కండరాల (హ్యామ్‌స్ట్రింగ్) గాయంతో బాధపడుతున్న కారణంగా ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి. జూన్ 13 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్‌లో కోహ్లీ ఆడటం కష్టమేనని సమాచారం.

భారత్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జూన్ 13న ధర్మశాలలో ప్రారంభం కానుంది. అనంతరం జూన్ 17న లక్నోలో, జూన్ 20న చెన్నైలో మిగిలిన రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో కోహ్లీకి చోటు దక్కినప్పటికీ, తాజా గాయం కారణంగా ఆయన అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది.

ఇటీవల జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్‌లో ఈ గాయం తలెత్తినట్లు సమాచారం. అహ్మదాబాద్‌లో జరిగిన ఆ తుది పోరులో ఆర్​సీబీ తరఫున ఆడిన కోహ్లీ, గుజరాత్​ టైటాన్స్ పై అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 42 బంతుల్లో 75 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే మ్యాచ్ చివరి దశలో పరుగులు తీయడంలో ఇబ్బంది పడుతూ కనిపించడంతో గాయంపై అప్పుడే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఫైనల్ మ్యాచ్‌లో కోహ్లీ అసౌకర్యంతో కనిపించినప్పటికీ, తన పోరాట స్ఫూర్తిని ప్రదర్శిస్తూ జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతని అద్భుత ప్రదర్శనతో ఆర్‌సీబీ వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. అయితే అదే మ్యాచ్‌లో వచ్చిన గాయం ఇప్పుడు భారత జట్టుకు ఆందోళన కలిగిస్తోంది.

ఈ ఐపీఎల్ సీజన్ మొత్తం కోహ్లీ అద్భుత ఫామ్‌లో కొనసాగాడు. 16 మ్యాచ్‌ల్లో 675 పరుగులు చేసి టోర్నీలో అత్యంత నిలకడగా రాణించిన బ్యాటర్లలో ఒకరిగా నిలిచాడు. 56.25 సగటు, 165.85 స్ట్రైక్‌రేట్‌తో ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. అతని ఫామ్‌ను దృష్టిలో ఉంచుకుంటే ఆఫ్ఘనిస్థాన్ సిరీస్‌కు దూరమవడం భారత జట్టుకు పెద్ద లోటుగా భావిస్తున్నారు.

కోహ్లీ ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌పైనే దృష్టి కేంద్రీకరించిన విషయం తెలిసిందే. టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలికిన తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాంటి సమయంలో గాయం కారణంగా కీలక సిరీస్‌ను మిస్ కావడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది.

మరోవైపు భారత కెప్టెన్ రోహిత్​ శర్మా అందుబాటుపై కూడా సందిగ్ధత కొనసాగుతోంది. ఆయన కూడా ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో భారత జట్టు మేనేజ్‌మెంట్‌కు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!