2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా అత్యంత ఘనంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు, యాత్రికులు పాల్గొనే ఈ మహత్తర ఆధ్యాత్మిక వేడుకను విజయవంతం చేసేందుకు ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. పుష్కరాల ఏర్పాట్లపై మంగళవారం సచివాలయంలో మంత్రుల కమిటీ, ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
సమావేశంలో గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించారు. యాత్రికులకు మెరుగైన సదుపాయాలు, రవాణా, భద్రత, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య సేవలు, వసతి, ట్రాఫిక్ నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ కార్యక్రమాన్ని కేవలం ఆధ్యాత్మిక వేడుకగా కాకుండా రాష్ట్ర ప్రతిష్ఠను ప్రపంచానికి చాటిచెప్పే అవకాశంగా మలచుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టు అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర ప్రజల కలల ప్రాజెక్టుగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టును 2027 గోదావరి పుష్కరాల నాటికి పూర్తిచేసి దేశానికి అంకితం చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. పోలవరం పూర్తి కావడం ద్వారా గోదావరి పుష్కరాలకు వచ్చే యాత్రికులకు ఇది ఒక ప్రధాన ఆకర్షణగా మారుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సాగునీటి విస్తరణ, తాగునీటి అవసరాల తీర్చడంలో పోలవరం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
గోదావరి తీర ప్రాంతాల అభివృద్ధిపై కూడా ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి పోలవరం వరకు ఉన్న ప్రాంతాన్ని ‘అఖండ గోదావరి కారిడార్’గా అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ కారిడార్ ద్వారా ఆధ్యాత్మిక పర్యాటకం, సాంస్కృతిక వారసత్వం, ప్రకృతి అందాలు, నదీ తీర అభివృద్ధిని సమన్వయం చేస్తూ ఒక సమగ్ర ప్రాజెక్టుగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.
పుష్కరాల కోసం చేపట్టే అన్ని మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు తాత్కాలికంగా కాకుండా శాశ్వత ప్రయోజనాలు కలిగించేలా ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. రహదారులు, ఘాట్లు, పార్కింగ్ ప్రాంతాలు, డ్రైనేజీ వ్యవస్థలు, పర్యాటక కేంద్రాలు, వసతి సౌకర్యాలు తదితర మౌలిక వసతులు భవిష్యత్తులో కూడా ప్రజలకు ఉపయోగపడేలా నిర్మించాలని ఆదేశించారు. గోదావరి బేసిన్ ప్రాంత అభివృద్ధికి ఇవి శాశ్వత ఆస్తులుగా నిలవాలని ఆకాంక్షించారు.
సమావేశంలో అధికారులు పుష్కరాల అంచనా వ్యయం, మౌలిక వసతుల అభివృద్ధి, యాత్రికుల నిర్వహణ ప్రణాళికలపై ముఖ్యమంత్రికి వివరించారు. గత పుష్కరాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మరింత మెరుగైన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి యాత్రికులకు సమాచార సేవలు, భద్రతా పర్యవేక్షణ, అత్యవసర సేవలను అందుబాటులో ఉంచే అంశాలను కూడా పరిశీలించారు.
గోదావరి పుష్కరాల ప్రభావంతో రాజమహేంద్రవరం నగరం వేగంగా అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. పుష్కరాల సందర్భంగా చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు నగర రూపురేఖలను మార్చివేస్తాయని, రాజమహేంద్రవరం భవిష్యత్తులో ఒక ప్రధాన మహానగరంగా ఎదిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. పర్యాటకం, వ్యాపారం, సేవారంగాలు, హోటల్ పరిశ్రమలకు ఈ పుష్కరాలు కొత్త ఊపునిస్తాయని అభిప్రాయపడ్డారు.





