విద్యతోనే అత్యున్నత స్థానాలు సాధ్యమని, రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనే, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. కూటమి ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యమిస్తోందని, ఇటీవల విడుదలైన టెన్త్, ఇంటర్ ఫలితాలే దీనికి నిదర్శమని అన్నారు. తన తండ్రి పేరు మీద ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు.
గుంటూరు నగరంలోని దేవరసాయి కృష్ణ కల్యాణ మండపంలో టెన్త్, ఇంటర్ లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన 104 మంది కురుబ, కురుమ, కురవ సామాజిక వర్గీయ విద్యార్థులకు ఉమ్మడి గుంటూరు కురమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భక్త కనకదాస పేరుతో ఏర్పాటు చేసిన ప్రతిభ పురస్కారాలు మంత్రి సవిత శుక్రవారం అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అత్యుత్తమ ప్రతిభ చాటిన విద్యార్థులకు కుల సంఘాలు బాసటగా నిలవడం అభినందనీయమన్నారు. విద్యలో రాణిస్తున్న పేద విద్యార్థులకు ఈ సత్కరాలు మరింత ప్రోత్సాహమిస్తాయన్నారు. ఏపీలో విద్యా వ్యవస్థను రాష్ట్ర ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ అత్యున్నత స్థానాలకు తీసుకెళుతున్నారన్నారు. గత పాలనలో భ్రష్టుపట్టిన విద్యా వ్యవస్థను ఆయన గాడిన పెడుతున్నారన్నారు.
టెన్త్, ఇంటర్ పరీక్షలకు ముందు వందరోజుల ప్రణాళికలు అమలు చేసి, అత్యుత్తమ ఫలితాలు సాధించడంలో ఆయన కృషి మెచ్చుకోదగినదన్నారు. తల్లికి వందనం, విద్యా మిత్ర కిట్లు, సన్నబియ్యంతో భోజనం, నాణ్యమైన విద్య ప్రభుత్వ విద్యా సంస్థల్లో అందుతున్నాయన్నారు. బీసీ గురుకులాలు, బీసీ హాస్టళ్లలో ఆహార, ఆరోగ్య భద్రతతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు.
కేవలం విద్యతోనే సరిపెట్టకుండా, క్రీడల్లోనూ ప్రోత్సహించేలా బీసీ గురుకులాల్లో స్పోర్ట్స్ కిట్లు అందజేయబోతున్నామన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలను తీర్చిదిద్దుతున్నామన్నారు. విద్యార్థులు లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగాలన్నారు. తల్లిదండ్రులు, సమాజం గర్వించేలా ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. తల్లిదండ్రులు సైతం పిల్లల మనోభావాలకు గౌరవిమిస్తూ, ఉన్నత విద్య చదివేలా ప్రోత్సహించాలన్నారు.
టెన్త్, సెకండ్ ఇంటర్ లో కురుబ, కురుమ, కురవ సామాజిక వర్గంలో మొదటి అయిదు స్థానాల్లో నిలిచిన ఇద్దరు విద్యార్థులకు రూ.5 వేల చొప్పున రూ.10 వేలు అందజేశారు. ద్వితీయ స్థానంలో నిలిచిన 20 మంది టెన్త్, ఇంటర్ విద్యార్థులకు రూ.3 వేల చొప్పున రూ.30 వేలు అందజేశారు. తృతీయ స్థానంలో నిలిచిన 20 మంది విద్యార్థులకు రూ.2 వేలు చొప్పున రూ.40 వేలు అందజేశారు. మరో 120 మంది విద్యార్థులకు రూ.వెయ్యి చొప్పున రూ.లక్షా 20 వేలు ప్రోత్సాహక నగదు రూపంలో అందజేశారు.
అంతకుముందు విద్యార్థులకు భక్త కనకదాస పురస్కారాలు అందజేయడానికి వచ్చిన మంత్రి సవితకు కురమ సంక్షేమ సంఘ ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మంత్రి సవిత స్థానిక విఘ్నేశ్వరుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం ప్రతినిధులు మర్రి వెంకట సత్యనారాయణ, తట్టి అర్జున రావు, ఎం.సత్యనారాయణ, బక్కా రామకృష్ణ, కార్పొరేటర్ ఎస్.శ్రీనివాసరావు, మర్రిపాటి రమేశ్, లంబు నాగేశ్వరరావు, వెంకట్రామయ్య, దన్నే అశోక్ తదితరులు పాల్గొన్నారు.





