జూన్ 7న ఫిట్ ఇండియా–సండేస్ ఆన్ సైకిల్

Must read

క్రీడలు, ఫిట్‌నెస్ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచే లక్ష్యంతో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్‌స్) ఆధ్వర్యంలో జూన్ 7న గచ్చిబౌలి స్టేడియంలో ‘ఫిట్ ఇండియా–సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా ఆరోగ్యకర జీవనశైలిపై ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. శాట్‌స్ వైస్ చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎ. సోనిబాలా దేవి, ఐఎఫ్‌ఎస్ శుక్రవారం లోక్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి కార్యక్రమానికి ఆహ్వానించారు. గవర్నర్ ఆహ్వానాన్ని స్వీకరించి కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

సైక్లింగ్ ర్యాలీ ఏర్పాట్లపై ఎల్‌బీ స్టేడియంలోని శాట్‌స్ కార్యాలయంలో వివిధ సైక్లింగ్ సంఘాల ప్రతినిధులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి ఏర్పాట్లను ఖరారు చేశారు.‘ఫిట్‌నెస్ కి డోస్–ఆధా గంటా రోజ్’ నినాదంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు, యువత, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సాధారణ ప్రజల్లో ఆరోగ్యం, ఫిట్‌నెస్, చురుకైన జీవన విధానంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

గచ్చిబౌలి స్టేడియం ప్రధాన ద్వారం నుంచి ప్రారంభమయ్యే సైక్లింగ్ ర్యాలీ ఐఐఐటీ జంక్షన్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, పిస్తా హౌస్ జంక్షన్, బిట్స్, కేబుల్ బ్రిడ్జ్, మాదాపూర్, భారతీయ విద్యాభవన్ సెంటర్ రోడ్, బయోడైవర్సిటీ రోడ్ మీదుగా తిరిగి స్టేడియానికి చేరుకుంటుంది.ఈ కార్యక్రమంలో సుమారు 2,000 మంది సైక్లిస్టులు పాల్గొనే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పాల్గొనే వారందరికీ తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ తరఫున పతకాలను, సర్టిఫికెట్లు అందజేయనున్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ సోనిబాలా దేవి మాట్లాడుతూ సైక్లింగ్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతో పాటు పర్యావరణ హిత రవాణా విధానమని అన్నారు. కాలుష్యాన్ని తగ్గించడంలో, సుస్థిర జీవనశైలిని ప్రోత్సహించడంలో సైక్లింగ్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు, క్రీడాకారులు, ఉద్యోగులు, వివిధ సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం ద్వారా సామాజిక అనుబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆమె తెలిపారు.

కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు నమోదు, ఇతర వివరాల కోసం గచ్చిబౌలి స్టేడియం అడ్మినిస్ట్రేటర్ కె. మధును 9000033100 నంబర్‌లో సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!