కేంద్ర జౌళి శాఖ మంత్రికి సీఎం ప్రతిపాదనలు

Must read

ఆంధ్రప్రదేశ్ లో వేర్వేరు ఉద్యాన పంటల ద్వారా ఉత్పత్తి అవుతున్న ఫైబర్ కు ప్రోత్సహం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి స్పష్టం చేశారు. ఈ మేరకు సచివాలయంలో శుక్రవారం తనను కలిసిన కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తో సీఎం ఈ ప్రతిపాదనలు సమర్పించారు.

రాయలసీమ సహా కోస్తాంధ్ర ప్రాంతాల్లో సాగు చేస్తున్న వివిధ పంటల ద్వారా పీచు, నార, ఫైబర్ ఉత్పత్తి అవుతుందని, దీనిని వాణిజ్య స్థాయిలో విలువ జోడించేందుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని సీఎం కోరారు. పీచు వెలికితీతతో పాటు వస్త్ర పరిశ్రమకు ఉపయోగపడే ఉద్యానవన పంటల నివేదికను సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రికి సమర్పించారు.

కడప, అనంతపురం, నంద్యాల, పశ్చిమ గోదావరి, కృష్ణా, తూర్పు గోదావరి లాంటి అరటి పండించే జిల్లాలలో పోస్ట్-హార్వెస్ట్ విలువ ఆధారిత ప్రక్రియగా అరటి కాండం పీచు వెలికితీత కేంద్రాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యాన శాఖ సమన్వయంతో స్వయం సహాయక సంఘాల కోసం క్లస్టర్ ఆధారిత మెకానికల్ డెకోర్టికేటర్ యూనిట్లను ప్రోత్సహించేలా సహకారం అందించాలని సీఎం కోరారు.

ప్రస్తుతం ఏపీలో 1,29,931 హెక్టార్లలో అరటి సాగవుతోందనీ. పంట కోత తర్వాత కాండం పూర్తిగా వృధాగా పోకుండా. సెల్యులోజిక్ పీచు ద్వారా పర్యావరణ అనుకూల ఫైబర్ తయారు అవుతుందని వివరించారు. వస్త్ర పరిశ్రమలో జనపనారతో సమానంగా ఇది ఉపకరిస్తుందని తెలిపారు. హస్తకళలు, జియో టెక్స్‌టైల్స్, ప్రత్యేక పేపర్, ఎగుమతి రకం దుస్తుల తయారీకి వనరుల లభ్యత ఉందని వివరించారు.

వస్త్ర పరిశ్రమతో పీపీపీ భాగస్వామ్యాల ద్వారా వెదురుకు సంబంధించిన మెకానికల్ ఫైబర్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని సీఎం ప్రతిపాదించారు. తద్వారా గిరిజన, మెట్ట ప్రాంత రైతులకు 30 ఏళ్ల పాటు నిరంతర ఆదాయం లభిస్తుందనీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పోక చెక్క ఆకుల ద్వారా లీఫ్ షీట్స్ తయారీకి అనుబంధ పరిశ్రమలకు అవకాశం ఉందని సీఎం వివరించారు.

ఏపీతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల వస్త్ర పరిశ్రమ క్లస్టర్లకు సమీపంలో ఉన్న కుప్పంలో పీఎం మిత్రా పార్కును ఏర్పాటు చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. 35 వేల పవర్ లూమ్ లు, 100కు పైగా స్పిన్నింగ్ మిల్లులు ఉన్నాయని తెలిపారు.

వివిధ చేనేత క్లస్టర్లలో అరటి ఫైబర్ తో బ్లెండ్ చేసిన నూలు వినియోగించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద మంగళగిరి లో 22.36 కోట్ల తో చేనేత పార్కు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు కోరారు. అలాగే అమరావతిలో చేనేత హస్త కళల మ్యూజియం ఏర్పాటుకు సహకారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ జౌళి మంత్రిత్వ శాఖ తరపున ఏపీకి పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!