నిత్యావసరాల ధరల మంట..

Must read

దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇప్పటికే పాలు, కూరగాయలు, వంటనూనెల ధరలు పెరిగి కుటుంబాల నెలవారీ ఖర్చులను పెంచగా.. ఇప్పుడు అల్పాహారంలో ముఖ్య భాగమైన బ్రెడ్ కూడా ఖరీదైపోయింది. ముఖ్యంగా ముంబాయ్ నగరం మరియు పరిసర ప్రాంతాల్లో బ్రెడ్ తయారీ కంపెనీలు ఒక్కో ప్యాకెట్‌పై రూ.5 వరకు ధరలను పెంచడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ముంబై మార్కెట్లో పలు బ్రెడ్ ఉత్పత్తులకు కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే మార్డెన్ బ్రెడ్ మే 16 నుంచి సవరించిన ధరలను అమలు చేయగా.. త్వరలోనే బ్రిటానయా ఇండస్ర్టీ , విబ్స్ వంటి ఇతర ప్రముఖ బ్రాండ్లు కూడా ఇదే మార్గంలో వెళ్లే అవకాశముందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

బ్రెడ్ అనేది పట్టణాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా విస్తృతంగా వినియోగించే ఆహార పదార్థంగా మారింది. ఉద్యోగులు, విద్యార్థులు, చిన్నపిల్లలు, వృద్ధులు ఇలా ప్రతి వర్గం ప్రజలు రోజువారీ అల్పాహారంలో బ్రెడ్‌ను ఉపయోగిస్తున్నారు. తక్కువ ఖర్చుతో త్వరగా సిద్ధమయ్యే ఆహారంగా దీని వినియోగం పెరిగింది.

అయితే వరుసగా పెరుగుతున్న ధరలతో ఇప్పుడు బ్రెడ్ కూడా సామాన్యుడికి భారంగా మారుతోంది. చిన్న కుటుంబాల నుంచి పెద్ద కుటుంబాల వరకు ప్రతిరోజూ వినియోగించే వస్తువుల ధరలు పెరగడం వల్ల నెలవారీ బడ్జెట్ దెబ్బతింటోందని వినియోగదారులు చెబుతున్నారు.

బ్రెడ్ తయారీదారుల ప్రకారం.. ఈ ధరల పెంపుకు ప్రధాన కారణం ఇంధన ధరల పెరుగుదల. ఇటీవల అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా ఇరాన్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు పెరిగాయి. దాంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు కూడా ప్రభావితమయ్యాయి.

వారం వ్యవధిలోనే ఇంధన ధరలు లీటరుకు దాదాపు రూ.3.90 వరకు పెరగడంతో రవాణా ఖర్చులు భారీగా పెరిగినట్లు బేకర్లు చెబుతున్నారు. గోధుమ పిండి, ముడిసరుకు రవాణా నుంచి తయారైన బ్రెడ్‌ను దుకాణాలకు చేర్చే వరకు ప్రతి దశలో ఖర్చు పెరిగిందని వారు వివరిస్తున్నారు.

ఇంధన ధరలతో పాటు బ్రెడ్ తయారీలో ఉపయోగించే ఇతర పదార్థాల ధరలు కూడా పెరిగాయి. ముఖ్యంగా బేకింగ్ ప్రక్రియలో ఉపయోగించే గ్యాస్ ధరలు పెరగడం కంపెనీలకు అదనపు భారంగా మారింది. ఉప్పు, ఈస్ట్, ప్రిజర్వేటివ్‌లు వంటి పదార్థాల ధరల్లో కూడా పెరుగుదల నమోదైనట్లు తయారీదారులు చెబుతున్నారు.

దీనికి తోడు విద్యుత్ చార్జీలు, కార్మిక వ్యయం, గిడ్డంగుల అద్దెలు వంటి ఖర్చులు కూడా పెరగడం వల్ల ఉత్పత్తి వ్యయం అధికమైందని పేర్కొంటున్నారు. ఈ కారణాల వల్లే ధరలను పెంచక తప్పలేదని కంపెనీలు వివరిస్తున్నాయి.

బ్రెడ్ ధరల పెంపులో మరో కీలక కారణం ప్యాకేజింగ్ ఖర్చుల పెరుగుదల. బ్రెడ్ ప్యాకింగ్ కోసం ఉపయోగించే ప్లాస్టిక్ ముడిసరుకును భారత్ పెద్దఎత్తున దిగుమతి చేసుకుంటుంది. అయితే ఇటీవల రూపాయి మారకం విలువ బలహీనపడటంతో దిగుమతి వ్యయం పెరిగింది. దీంతో ప్లాస్టిక్ కవర్లు, ప్యాకేజింగ్ మెటీరియల్ ధరలు కూడా అధికమయ్యాయి. తయారీదారుల ప్రకారం.. ప్యాకేజింగ్ ఖర్చు ఒక్కటే గత కొన్ని నెలల్లో గణనీయంగా పెరిగిందని చెబుతున్నారు.

బ్రెడ్ ధరల పెంపుతో పాటు త్వరలో బన్స్, కేక్స్, బిస్కెట్లు, పేస్ట్రీలు వంటి ఇతర బేకరీ ఉత్పత్తుల ధరలు కూడా పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కొన్ని చిన్న బేకరీలు ధరలను సవరించడం ప్రారంభించాయని సమాచారం. పెరుగుతున్న ముడిసరుకు ధరలు కొనసాగితే రాబోయే రోజుల్లో వినియోగదారులపై మరింత భారం పడే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!