తెలంగాణ రాష్ట్రంలో మరోసారి వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. ఒకవైపు ద్రోణి, ఉపరితల చక్రవాత ఆవర్తనం ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముండగా.. మరోవైపు ఎండల తీవ్రత కూడా పెరుగుతుండటంతో ప్రజలు ఉక్కపోత, వడగాలులతో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వాతావరణశాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం మంగళ, బుధ (నేడు, రేపు) రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ప్రస్తుతం దక్షిణ భారతదేశంపై కొనసాగుతున్న ద్రోణి ప్రభావం, దానికి తోడు ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తనం కారణంగా వాతావరణంలో అస్థిరత పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో తెలంగాణలోని అనేక జిల్లాల్లో మేఘావృత వాతావరణం నెలకొనే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత నుంచి సాయంత్రం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
హైదరాబాద్ నగరంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.
వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు కూడా సంభవించే అవకాశం ఉన్నందున చెట్ల కింద నిలబడరాదని, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. రైతులు వ్యవసాయ పనుల సమయంలో వాతావరణ పరిస్థితులను గమనించాలని, పిడుగుపాట్ల సమయంలో పొలాల్లో ఉండకూడదని హెచ్చరించారు.





