దేశవ్యాప్తంగా ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఆలయాల్లో పనిచేస్తున్న పూజారులు, సేవాదార్లు, ఇతర సిబ్బందికి ఏకరీతి వేతనాలు, సంక్షేమ పథకాలు అమలు చేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ అంశంలో న్యాయస్థానం జోక్యం చేసుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేస్తూ పిటిషన్‌ను తిరస్కరించింది.
ఈ పిల్‌ను న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేశారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆలయాల్లో పనిచేస్తున్న పూజారులు, అర్చకులు, సేవాదార్లు, ఇతర సిబ్బంది సేవా నిబంధనలు, వేతన విధానాలను సమీక్షించేందుకు జ్యుడీషియల్ కమిషన్ లేదా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన కోర్టును కోరారు. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో ఆలయ సిబ్బంది ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని కేంద్ర స్థాయిలో ఏకరీతి విధానం తీసుకురావాల్సిన అవసరం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
పిటిషనర్ వాదన ప్రకారం.. వేతనాల కోడ్-2019లోని సెక్షన్ 2(కే) ప్రకారం ఆలయాల్లో పనిచేస్తున్న పూజారులు, ఇతర సిబ్బందిని కూడా “ఉద్యోగులు”గా గుర్తించాలని కోరారు. వారికి కనీస వేతనం, ఆరోగ్య భద్రత, పెన్షన్, సామాజిక భద్రత వంటి కార్మిక సంక్షేమ ప్రయోజనాలు కల్పించాలని అభ్యర్థించారు.
ప్రభుత్వాలు ఆలయాలపై పరిపాలనా, ఆర్థిక నియంత్రణ నిర్వహిస్తున్నందున పూజారులు, సిబ్బందితో ప్రభుత్వానికి యజమాని-ఉద్యోగి సంబంధం ఏర్పడుతుందని పిటిషనర్ వాదించారు. ఆలయాల ఆదాయం, నియామకాలు, పరిపాలనపై పూర్తి నియంత్రణ ప్రభుత్వాల చేతుల్లో ఉండి కూడా అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి సరైన వేతనాలు, సంక్షేమ ప్రయోజనాలు ఇవ్వకపోవడం అన్యాయమని పేర్కొన్నారు.
ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోని అనేక ఆలయాల్లో పూజారులు, సేవాదార్లు నెలకు కేవలం రూ.1,000 నుంచి రూ.5,000 వరకు మాత్రమే గౌరవ వేతనాలు పొందుతున్నారని పిటిషన్‌లో వివరించారు. చాలామంది దక్షిణలు, భక్తుల విరాళాలపైనే ఆధారపడి జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధాప్యంలో వారికి పెన్షన్ సదుపాయం కూడా లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ఆలయ సిబ్బందికి కనీస జీవన భద్రత కూడా లేకపోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు), ఆర్టికల్ 21 (జీవన హక్కు)లను ఉల్లంఘించడమేనని పిటిషనర్ వాదించారు. ఇతర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు లభించే కార్మిక సంక్షేమ ప్రయోజనాలు ఆలయ సిబ్బందికి కూడా వర్తింపజేయాలని కోరారు.
అయితే ఈ అంశంలో విధాన నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వాల పరిధిలోకి వస్తుందని, కోర్టు నేరుగా జోక్యం చేసుకోలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పూజారులు, ఆలయ సిబ్బందికి వేతనాలు, సంక్షేమ విధానాల రూపకల్పన పాలనాపరమైన అంశమని ధర్మాసనం అభిప్రాయపడింది.
ఈ కేసు నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆలయ సిబ్బంది పరిస్థితిపై మరోసారి చర్చ ప్రారంభమైంది. ముఖ్యంగా చిన్న దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులు, సేవాదార్లు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు సామాజిక వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ నియంత్రిత ఆలయాల ఆదాయం పెరుగుతున్నప్పటికీ అక్కడ పనిచేస్తున్న సిబ్బంది జీవన ప్రమాణాలు మాత్రం మెరుగుపడటం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. ఆలయ సిబ్బంది సంక్షేమంపై ప్రత్యేక విధానాలు తీసుకురావాలన్న డిమాండ్లు భవిష్యత్తులో మరింత బలపడే అవకాశం కనిపిస్తోంది.





