ఘనంగా కాలిఫోర్నియా వీక్షణం 165వ అంతర్జాల సమావేశం

Must read

శనివారం ఉదయం వీక్షణం 165వ అంతర్జాల సమావేశం ముచ్చటగా మూడు గంటలు జరిగింది. సభ అధ్యక్షురాలు మరియు వీక్షణం వ్యవస్థాపుకురాలు డాక్టర్ కె.గీతా మాధవి స్వీయ పరిచయం చేసుకోబోతున్న కవి గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ మరియు అవధానం అమృతవల్లికి, మరియు కవిసమ్మేళనంలో పాల్గొంటున్న కవులకు, కవయిత్రులకు స్వాగతం పలికారు.

మొదట రాజేంద్ర ప్రసాద్ తన స్వీయ పరిచయాన్ని చేసుకున్నారు. కవిత్వం రాయటానికి ఆంగ్ల కవులు వర్డ్సువర్త్, కీట్స్, షెల్లీ, తెలుగు కవులు శ్రీశ్రీ, దేవులపల్లి క్రిష్ణశాస్త్రి, సినారె, దాశరధి కవితల ప్రభావాన్ని చదివి అందరినీ ఆకట్టుకున్నారు. తర్వాత తన కలియుగ శతకం అముద్రిత పుస్తకంలోని పద్యాలను పఠించారు. తన సుమ సౌరభాలు, తెలుగు సౌరభాలు, కవితా సౌరభాలు, అక్షర సౌరభాలు పుస్తకాల గురించి సమగ్రంగా వివరించారు. నవ కవులకు ఎక్కువగా చదవమని, మనుషులను, ప్రకృతిని గమనించమని, అనుకరణ కాదు – స్వతంత్రతా భావాలు ముఖ్యమని, తెలుగుభాషను ప్రేమించమని, విమర్శలను స్వీకరించి సరిదిద్దుకొమ్మని, నిరంతర సాధనచేయమని సలహా ఇచ్చారు.

పిమ్మట కవయిత్రి అవధానం అమృతవల్లి కడప జిల్లా పెన్నా తీరాన పుట్టానని, పల్లెజీవితాలు, ప్రకృతి అందాలు చూచి కవిత్వం రాయటం మొదలుపెట్టానని చెప్పారు. కవి స్పందనలే కవితలన్నారు. తన మూడు పుస్తకాలు బువ్వ పూలు, మట్టి చిగురులు, అమృతధారలు (కంద పద్యాలు) గురించి వివరించారు. తమ మనసులోని స్పందనలనే కవితలుగా రూపొందించమని యువకవులకు సూచనచేశారు. సమావేశంలో పాల్గొన్న కవులందరూ ప్రసంగాలు బాగా ఉన్నాయని మెచ్చుకున్నారు.

అనంతరం కవిసమ్మేళన సామ్రాట్ డాక్టర్ రాధా కుసుమ కవిసమ్మేళనాన్ని ఆద్యంతం చిరునవ్వులు చిందిస్తూ చక్కగా నిర్వహించారు. మొత్తం 30 మంది కవులు ఈ కవిసమ్మేళనంలో పాల్గొన్నారు. కొత్తూరు వెంకట్ రెండు పద్యాలను వినిపించారు. డాక్టర్ గీతా మాధవి అమ్మకడుపు చల్లగా అనే కవితను హృద్యంగా చదివి అందరినీ అలరించారు. ముప్పాళ్ళ భవాని అమ్మకు గిఫ్టు కవితను, వైరాగ్యం ప్రభాకర్ బాల్యానికి భరోసా కవితను, డాక్టర్ బృందా జోహార్ జోహార్ ఓ కార్మిక వీరుడా కవితను, భోగెల ఉమామహేశ్వరరావు తెలుగు వెలుగు కవితను, డాక్టర్ చీదెళ్ళ సీతాలక్ష్మి రవీంద్రునికి కైమోడ్పులు కవితను, బౌరోతు శంకరరావు తన శంకర శతకంలోని పద్యాలను, కమర ఆది మోపిదేవి పరశురాముడు కట్టెలు కొట్టుకురా కవితను, ఒంగోలు కవి ఉప్పలపాటి వెంకట రత్నం అక్షరం ఆయుధాలు కవితను, డాక్టర్ శాంతిశ్రీ చైతన్యజ్యోతి కవితను, మేడిశెట్టి యోగేశ్వరరావు లయాత్మకంగా కవి నేను కవితను, డాక్టర్ దేవులపల్లి పద్మజ పద్మపాణి అనే సూర్యునిపై కవితను, అవధానం అమృతవల్లి ఆమెకదా గుర్తించేది అని అమ్మ మీద కవితను, డాక్టర్ రాధాకుసుమ మానవత్వం అనే మంచి కవితను వినిపించారు. చివరగా గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ అమ్మ అమృతస్వరూపిణి అనే కవితను ఉద్వేగంగా చదివి అందరి మన్ననలను పొందారు.

డాక్టర్ గీతా మాధవి కవుల పరిచయ ప్రసంగాలు బాగా సాగాయని, కవులు మంచి కవితలు చదివారని అభినందించి. ధన్యవాదాలు చెప్పి సమావేశాన్ని ముగించారు. కార్యక్రమాన్ని ఆసక్తికరంగా నిర్వహించిన వీక్షణానికి కవులు ధన్యవాదాలు తెలిపి, వచ్చే నేల సమావేశానికి ఎదురుచూస్తుంటామని చెప్పారు.

గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, వీక్షణం భారతదేశ ప్రతినిధి.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!