నెదర్లాండ్స్ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశంలోని ‘ది హేగ్’ నగరంలో ప్రవాస భారతీయులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత దేశ ప్రగతి ప్రస్థానం, ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లు, భారత్-నెదర్లాండ్స్ మధ్య ఉన్న దౌత్య సంబంధాలపై ఆయన ఎంతో కీలకమైన ప్రసంగం చేశారు.
సభా ప్రాంగణానికి చేరుకున్న ప్రధానికి అక్కడ స్థిరపడిన భారతీయులు ఘన స్వాగతం పలికారు. ప్రవాస భారతీయులలో కనిపించిన ఉత్సాహాన్ని చూస్తుంటే తాను భారతదేశంలోని ఏదో ఒక పెద్ద పండుగలో పాల్గొన్నట్లుగా అనిపిస్తోందని ప్రధాని మోదీ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. నెదర్లాండ్స్ దేశ అగ్ర నాయకత్వంతో తాను ఎప్పుడు మాట్లాడినా.. వారు ఇక్కడి భారతీయుల కష్టపడే తత్వాన్ని, వారి ప్రతిభను ఎంతో గొప్పగా ప్రశంసిస్తారని గుర్తుచేశారు. డచ్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో మనవాళ్లు అందిస్తున్న సేవలను చూసి ప్రతి భారతీయుడు గర్వపడాలన్నారు.
ది హేగ్ నగరం భారత్-నెదర్లాండ్స్ దేశాల స్నేహానికి ఒక సజీవ చిహ్నంగా మారిందని ప్రధాని మోదీ అభివర్ణించారు. ఎన్నో ఏళ్ల క్రితం ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకుని ఇక్కడ స్థిరపడిన భారతీయ కుటుంబాల కథలు కేవలం వలసల కథలు మాత్రమే కావని, అవి వారి ఆత్మవిశ్వాసానికి, సాధించిన అభివృద్ధికి నిదర్శనాలని చెప్పారు. కాలం గడిచి తరాలు మారినా, దేశాలు మారినా కూడా భారతీయ కుటుంబాల విలువలు, మన సంస్కృతి సంప్రదాయాలు అస్సలు మారలేదని ఆయన కొనియాడారు. ఇక్కడి జీవనశైలికి అలవాటు పడి, డచ్ భాషను పూర్తిగా నేర్చుకున్నప్పటికీ.. తమ మూల భాషలను, భారతీయ పండుగలను ప్రవాస భారతీయులు మర్చిపోకుండా గుండెల్లో దాచుకున్నారని అభినందించారు.
ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తీవ్రమైన సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. మొదట కరోనా మహమ్మారి వచ్చి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిందని, ఆ తర్వాత దేశాల మధ్య యుద్ధాలు ప్రారంభమయ్యాయని, ఇప్పుడు ఇంధన (ఆయిల్, గ్యాస్) సంక్షేమం ప్రపంచాన్ని వేధిస్తోందని ఆయన వివరించారు. ఈ పరిణామాలను చూస్తుంటే ప్రస్తుత దశాబ్దం ప్రపంచానికి ఒక విపత్తుల (డిజాస్టర్ల) దశకంగా మారుతోందని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయంగా పరిస్థితులు గనుక త్వరగా మారకపోతే, ప్రపంచ దేశాలు గత కొన్ని దశాబ్దాలుగా సాధించిన అభివృద్ధి ఫలితాలన్నీ ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందనన్నారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో ప్రజలు మళ్లీ పేదరికంలోకి జారిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రపంచ దేశాలన్నీ నమ్మకమైన సరఫరా వ్యవస్థ (రెసిలియెంట్ సప్లై చైన్) వైపు చూస్తున్నాయని ప్రధాని తెలిపారు. ఈ క్రమంలోనే భారత్, నెదర్లాండ్స్ దేశాలు కలిసి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఎంతో నమ్మకమైన, పారదర్శకమైన సరఫరా వ్యవస్థను రూపొందించేందుకు చేతులు కలిపాయని చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం తీసుకురావడానికి రెండు దేశాలు తమ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నాయని వెల్లడించారు. 21వ శతాబ్దంలో భారతదేశం ప్రపంచానికి ఒక అపారమైన అవకాశాల భూమిగా ఎదుగుతోందని ప్రధాని పేర్కొన్నారు. భారత్ ఒకవైపు సరికొత్త టెక్నాలజీతో దూసుకుపోతూనే, మరోవైపు మానవీయ విలువలను కాపాడుకుంటూ సమతుల్యంగా ముందుకు సాగుతోందన్నారు. మన దేశం ఎంత పురాతనమైనదో, అంతే ఆధునికంగా కూడా మారుతోందని వ్యాఖ్యానించారు.





