కేంద్రం నిధులు ఇవ్వకున్నా ఇందిరమ్మ ఇండ్లు ఆగ‌వు :మంత్రి పొంగులేటి

Must read

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, ప్రజాదరణ పొందిన ‘ఇందిరమ్మ ఇండ్ల పథకం’ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రావలసిన వాటా నిధులు ఇంకా విడుదల కాలేదని, వీటి కోసం తాము ఈ ఏడాది మార్చి నెల నుంచి నిరీక్షిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

శనివారం సెక్రటేరియట్‌లోని తన ఛాంబర్‌లో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్ సందర్భంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నుంచి నిధులు వస్తాయనే నమ్మకంతోనే తాము ఇందిరమ్మ లబ్ధిదారులకు సంబంధించిన ఫైనల్ బిల్లులను తాత్కాలికంగా ఆపామని స్పష్టం చేశారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం మరో 15 నుంచి 20 రోజుల్లోగా ఈ నిధులను విడుదల చేయకపోతే, లబ్ధిదారులను ఇబ్బంది పెట్టకుండా ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరించి ఇండ్ల నిర్మాణ నిధులను అందజేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్కో ఇందిరమ్మ ఇంటికి సుమారు ₹1,13,000 చొప్పున వాటా నిధులు విడుదల కావాల్సి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరించారు. ఇప్పటివరకు కేంద్రం నుంచి తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలకు ఒక్క ఇల్లు కూడా మంజూరు కాలేదన్నారు. ఈ నిధుల సాధన కోసం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో పాటు తాను కూడా పదే పదే కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి ప్రయత్నిస్తూనే ఉన్నామని చెప్పారు. అయినప్పటికీ లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాష్ట్ర బడ్జెట్ నుంచైనా సరే నిధులు ఇచ్చి ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు.

రాష్ట్రంలో మొదటి విడత కింద 3.50 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయగా.. అందులో ఇప్పటివరకు సుమారు 1.32 లక్షల ఇండ్ల నిర్మాణాలు విజయవంతంగా పూర్తయ్యాయని మంత్రి వెల్లడించారు. రాబోయే జూన్ నెలాఖరు నాటికి మరో 68 వేల నుంచి 72 వేల ఇండ్ల శ్లాబుల నిర్మాణం కూడా పూర్తవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇకపోతే, రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ 2వ తేదీన ఆదిలాబాద్ జిల్లా వేదికగా అధికారికంగా ప్రారంభిస్తారని ప్రకటించారు.

రెండో విడత మంజూరులో పేదలకు అనేక రకాల వెసులుబాట్లను కల్పిస్తున్నట్లు చెప్పారు. కేవలం ఖాళీ స్థలాలకే కాకుండా.. గతంలో సగం దూరంలో ఆగిపోయిన గోడలు, బేస్‌మెంట్ లెవెల్ పనులు, శ్లాబ్ వరకు గోడలు ఉండి శ్లాబ్ లేని ఇండ్లకు కూడా ఇందిరమ్మ పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి ఎన్ని ఇండ్లు మంజూరు చేయాలనే సంఖ్యను ఈనెల 21న జరిగే క్యాబినెట్ సమావేశంలో చర్చించి అధికారికంగా ప్రకటిస్తామని మంత్రి తెలిపారు.

రాష్ట్రంలో భూముల ప్రభుత్వ మార్కెట్ ధరలను సవరించాలని, కొన్ని ప్రాంతాల్లో వాస్తవ ధరలతో పోలిస్తే విపరీతంగా ఉన్న హెచ్చుతగ్గులను క్రమబద్ధీకరించాలని ఇటీవలి క్యాబినెట్ భేటీలో నిర్ణయించామని పొంగులేటి తెలిపారు. దీని ప్రకారం ఈ మే నెలాఖరు నాటికి భూముల కొత్త ధరలను సవరించి అమలులోకి తెస్తామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లో కేవలం ఆరు నెలల వ్యవధిలోనే రెండుసార్లు అత్యంత అశాస్త్రీయ పద్ధతిలో భూముల ధరలను పెంచిందని విమర్శించారు. తాము మాత్రం ప్రముఖ ఆర్థిక నిపుణులైన అరవింద్ సుబ్రహ్మణ్యం కమిటీ ఇచ్చిన సలహాలు, సూచనల మేరకు ఎంతో శాస్త్రీయ పద్ధతిలో విశ్లేషించి మాత్రమే మార్కెట్ ధరలను సవరిస్తున్నామని చెప్పారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!