అన్నదాతకు అండగా ప్రభుత్వం :ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమీక్ష

Must read

తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యుద్ధం ప్రకటించారు. క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందులపై తీవ్రంగా స్పందించిన ఆయన, ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఉపేక్షించేది లేదని అధికారులను హెచ్చరించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి , ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

కొనుగోలు కేంద్రాలకు రైతులు తెచ్చిన పంటను సకాలంలో తూకం వేయకపోవడం, గన్ని బ్యాగులు మరియు హమాలీల కొరతపై వస్తున్న ఫిర్యాదులపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్లు ఏసీ గదులకే పరిమితం కాకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలను సందర్శించి, సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. విధి నిర్వహణలో విఫలమైతే కలెక్టర్లపై కూడా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం వెనుకాడదని స్పష్టం చేయడం గమనార్హం.

ధాన్యం తరలింపులో రవాణా సౌకర్యాల కొరత లేకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి రవాణా శాఖ కమిషనర్‌ను ఆదేశించారు. నిబంధనల ప్రకారం లారీలను అందుబాటులో ఉంచని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టడమే కాకుండా, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సూచించారు. గోడౌన్లలో స్థలం లేదని సాకులు చెప్పవద్దని, అవసరమైతే రైతు బజార్లు, కమ్యూనిటీ హాళ్లు, ఫంక్షన్ హాళ్లను తాత్కాలిక గిడ్డంగులుగా మార్చుకోవాలని వెసులుబాటు కల్పించారు.

ధాన్యం లోడింగ్ ప్రక్రియ వేగవంతం చేసేందుకు స్థానిక హమాలీలను వినియోగించుకోవాలని, లోడింగ్ పూర్తి కాగానే రైతులకు వెంటనే రశీదులు అందజేయాలని ఆదేశించారు. దీనివల్ల తాలు, తరుగు పేరుతో కొందరు వ్యాపారులు చేసే అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని సీఎం అభిప్రాయపడ్డారు. రైతులు తమ కష్టార్జితాన్ని దళారులకు అమ్ముకోకుండా ప్రభుత్వమే పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

అకాల వర్షాల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో, రైతులు నష్టపోకుండా ఉండేందుకు శాశ్వత పరిష్కారాల దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడవకుండా ఉండేందుకు సరిపడా టార్పాలిన్ కవర్లను అందుబాటులో ఉంచాలని కలెక్టర్లకు సూచించారు. వాతావరణ శాఖ ఇచ్చే హెచ్చరికలను ఎప్పటికప్పుడు రైతులకు చేరవేసేందుకు మండల స్థాయిలో ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించారు.

రైతులు అప్రమత్తంగా ఉంటే పంట నష్టాన్ని నివారించవచ్చని చెప్పారు. మొక్కజొన్న పంట ఎక్కువగా పండే జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేసి, పక్కా ప్రణాళికతో సేకరణ జరపాలని పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం మరియు పోలీసులు సమన్వయంతో పనిచేసి ధాన్యం సేకరణ సాఫీగా జరిగేలా చూడాలని, ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే సీఎస్‌కు నివేదించాలని సూచించారు.

మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కూడా ఈ సమావేశంలో అధికారులకు పలు సూచనలు చేశారు. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తోందని, ఈ ప్రయోజనం మన రాష్ట్ర రైతులకు మాత్రమే దక్కాలని వారు స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం సరిహద్దులు దాటి తెలంగాణ కేంద్రాలకు రాకుండా చెక్ పోస్టుల వద్ద కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని కలెక్టర్లకు తెలిపారు. అన్నదాతకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడటమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!