సనాతన ధర్మంపై ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు

Must read

తమిళనాడు రాజకీయాలు మరోసారి ‘సనాతన ధర్మం’ చుట్టూ తిరుగుతున్నాయి. డీఎంకే యువనేత, మాజీ ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి. ప్రతిపక్ష నేతగా తన తొలి ప్రసంగాన్ని వినిపిస్తూ, సనాతన ధర్మం ప్రజలను విభజిస్తోందని, దానిని కచ్చితంగా నిర్మూలించాలంటూ 2023 సెప్టెంబర్‌లో తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ఆయన మళ్ళీ కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు.

ఆనాడు ఈ వ్యాఖ్యల వల్ల కోర్టు కేసులు, తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, ఉదయనిధి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన పాత వైఖరినే పునరుద్ఘాటించడం గమనార్హం. ద్రవిడ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నామని చాటుతూనే, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో తాము రాజీపడబోమని ఆయన తేల్చి చెప్పారు. అసెంబ్లీలో ప్రతిపక్షం ఒక నిర్మాణాత్మక శక్తిగా పనిచేయాలని, గతంలో కంటే ఇప్పుడు ప్రతిపక్షానికి బలమైన సంఖ్యా బలం ఉందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ప్రధానంగా ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జరిగిన ప్రోటోకాల్ తప్పిదాలను ఉదయనిధి ఎండగట్టారు. తమిళ రాష్ట్ర గీతమైన ‘తమిళ్ తాయ్ వాల్తు’ను కాదని, ముందుగా వందేమాతరం, జనగణమన పాడటంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమిళనాడులో జరిగే ఏ ప్రభుత్వ కార్యక్రమంలోనైనా రాష్ట్ర గీతానికే ప్రథమ స్థానం ఉండాలని, మన హక్కులను, సంప్రదాయాలను కాపాడుకోవడంలో రాజీ పడకూడదని హితవు పలికారు.

గతంలో గవర్నర్ ఆర్.ఎన్. రవి గీతాల ఆలాపనలో మార్పులు చేయడానికి ప్రయత్నిస్తే డీఎంకే ఏ విధంగా అడ్డుకుందో గుర్తు చేస్తూ, ప్రస్తుత విజయ్ ప్రభుత్వం ఇలాంటి పొరపాట్లు మళ్లీ జరగనివ్వకూడదని హెచ్చరించారు. రాష్ట్ర గీతాన్ని పక్కన పెట్టే ఏ ప్రయత్నాన్ని డీఎంకే అనుమతించదని, ప్రజల సెంటిమెంట్లతో ఆడుకోవద్దని సూచించారు.

తన ప్రసంగంలో భాగంగా ఉదయనిధి స్టాలిన్ కాస్తా చమత్కారాన్ని కూడా జోడించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్, స్పీకర్ జేసీడీ ప్రభాకర్ మరియు తాను ఒకే లొయోలా కాలేజీలో చదువుకున్నామని, అందరం పూర్వ విద్యార్థులమేనని చెప్పారు. అయితే, చదువులో క్లాస్‌మేట్స్ అయినప్పటికీ, రాజకీయాల్లో మాత్రం డీఎంకే పార్టీనే సీనియర్ బ్యాచ్ అని ఎద్దేవా చేశారు.

ద్రవిడ దిగ్గజం సీఎన్ అన్నాదురై మాటలను ఉటంకిస్తూ.. ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల దిశగా సాగాలంటే ప్రతిపక్షం అనేది ఒక వాహనానికి ఉన్న బ్రేకులు లేదా ఎద్దుకు కళ్లెం లాంటిదని అభివర్ణించారు. అధికార పక్షం ‘అందరికీ అన్నీ’ అనే సూత్రాన్ని పాటిస్తుందో లేదో తాము నిరంతరం నిఘా ఉంచుతామని, స్పీకర్ తటస్థంగా ఉండి ప్రతిపక్షానికి తగిన అవకాశం ఇవ్వాలని కోరారు. సభలో మహిళా ఎమ్మెల్యేల సంఖ్య పెరగడం పట్ల కూడా ఆయన హర్షం వ్యక్తం చేశారు.

మరోవైపు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో స్పందించింది. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఆయన మళ్లీ సనాతన ధర్మంపై ద్వేషాన్ని వెళ్లగక్కుతున్నారని బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనావాలా మండిపడ్డారు. గతంలో సుప్రీంకోర్టు కూడా ఇలాంటి వ్యాఖ్యలను ద్వేషపూరిత ప్రసంగాలుగా పరిగణించిందని, అయినా ఉదయనిధిలో మార్పు రాలేదని విమర్శించారు. డీఎంకే పరాజయం పాలైనప్పటికీ, హిందూ వ్యతిరేక ధోరణిని వీడటం లేదని, కాంగ్రెస్ వంటి మిత్రపక్షాలు కూడా దీనిని ఖండించకపోవడం దారుణమని ఆయన ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా ఆరోపించారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!