తెలంగాణ రాష్ట్రంలో ఎండలు నిప్పులు చెరుగుతున్నాయి. గత నెల రోజులుగా భానుడి భగభగలకు జనం అల్లాడిపోతుండగా, ఇప్పుడు ఎండల తీవ్రత మరింత పెరగనుందన్న వార్త ప్రజలను కలవరపెడుతోంది. రాబోయే ఐదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని, ఎండలు తీవ్రంగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇప్పటికే అనేక జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటేశాయి. దీనికి తోడు విపరీతమైన ఉక్కపోత తోడవ్వడంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు.
వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల చివరి వరకు ఎండల తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. ఎండల నుంచి ఎప్పుడు ఉపశమనం దొరుకుతుందా అని ఆశగా ఎదురుచూస్తున్న సామాన్యులకు వాతావరణ శాఖ తాజా ప్రకటన షాక్ ఇచ్చినట్లయింది. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని నిపుణులు సూచిస్తున్నారు.
గత కొద్ది రోజులుగా అక్కడక్కడ కురిసిన తేలికపాటి జల్లులు ప్రజలకు కొంత ఉపశమనాన్ని ఇచ్చాయి. సముద్రం నుంచి వచ్చిన తేమ గాలులు, ఆకాశంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఉష్ణోగ్రతలు 3 నుంచి 5 డిగ్రీల వరకు తగ్గి వాతావరణం కాస్త చల్లబడింది. ఇప్పుడు ఆ వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ద్రోణి ప్రభావం బలహీనపడటంతో మళ్లీ పొడి గాలులు మొదలయ్యాయని, సోమవారం నుంచే ఉష్ణోగ్రతలు యధావిధిగా పెరగడం ప్రారంభమైందని అధికారులు స్పష్టం చేశారు.
గాలి మళ్ళిన దిశ (విండ్ డైరెక్షన్) మారడం వల్ల వేడి తీవ్రత పెరిగిందని, దీనివల్ల ఉష్ణోగ్రతలు మళ్లీ 40 డిగ్రీల పైకి చేరుకుంటున్నాయని తెలిపారు. ఏ ప్రాంతంలోనైనా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిన వెంటనే అక్కడ ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేస్తామని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఈ పరిస్థితి నెలకొందని, రాబోయే రోజుల్లో వేడిగాలుల ప్రభావం కూడా ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది.
మరోవైపు, ఈ మారుతున్న వాతావరణం అన్నదాతలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఒకవైపు మండుతున్న ఎండలు, మరోవైపు అకస్మాత్తుగా వచ్చే అకాల వర్షాలతో రైతులు సతమతమవుతున్నారు. ప్రస్తుతం వరి, మొక్కజొన్న కోతలు పూర్తయి, ఆ ధాన్యాన్ని ఆరబెట్టేందుకు రైతులు కల్లాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. ఎండ తీవ్రత వల్ల ధాన్యం త్వరగా ఆరుతుందని సంతోషపడేలోపే, ఆకస్మికంగా కురుస్తున్న వర్షాలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
తడిసిన ధాన్యాన్ని మళ్లీ ఆరబెట్టడం రైతులకు పెద్ద సవాలుగా మారింది. అకాల వర్షాల వల్ల ధాన్యం నాణ్యత దెబ్బతింటుందని, తద్వారా మద్దతు ధర రాదేమోనని రైతాంగం ఆందోళన చెందుతోంది. అటు పగటిపూట నిప్పులు చెరిగే ఎండ, ఇటు సాయంత్రం వేళ అకాల వర్షాలతో వాతావరణంలో అనిశ్చితి నెలకొంది.
మే నెల చివరి వరకు ఇదే రకమైన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ స్పష్టం చేయడంతో, అప్పటి వరకు ప్రజలు ఈ నిప్పుల కొలిమిని తట్టుకోక తప్పదు. వాతావరణంలో వచ్చే మార్పులను గమనిస్తూ ఉండాలని, ఎండ తీవ్రత దృష్ట్యా అధికారులు ఇచ్చే సూచనలను పాటించాలని ప్రభుత్వం కోరుతోంది. రాబోయే ఐదు రోజులు మాత్రం రాష్ట్రానికి అత్యంత క్లిష్టమైన రోజులుగా మారనున్నాయి.





