ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న ఆక్వా రంగంపై ఫీడ్ కంపెనీలు ధరల భారాన్ని మోపడం పట్ల రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా స్పందించారు. రొయ్యల మేత ధరలను కంపెనీలు ఇష్టానుసారంగా పెంచడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆక్వా రైతులతో ఎలాంటి చర్చలు జరపకుండా, ముందస్తు సమాచారం లేకుండా ధరలు పెంచడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా వనామీ రకం ఫీడ్‌పై కిలోకు 8 రూపాయలు, టైగర్ రకం ఫీడ్‌పై 10 రూపాయల చొప్పున పెంచడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని నియంత్రించే ఏపీఎస్ఏడీఏ చట్టాన్ని ప్రతి కంపెనీ తూచా తప్పకుండా పాటించాలని, ధరల పెంపు వంటి కీలక నిర్ణయాలను చట్టబద్ధమైన కమిటీలోనే తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. పెంచిన ధరల అమలును తక్షణమే నిలిపివేయాలని ఆదేశిస్తూ సంబంధిత కంపెనీలకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే ఏ చర్యలనైనా ప్రభుత్వం ఉపేక్షించదని, ఆక్వా సాగుదారులకు అన్యాయం జరిగితే సహించే ప్రసక్తి లేదని అచ్చెన్నాయుడు గట్టిగా హెచ్చరించారు.
మరోవైపు, రొయ్యల మేత ధరల పెంపును నిరసిస్తూ పశ్చిమగోదావరి జిల్లాలో ఆక్వా రైతులు రణరంగం సృష్టించారు. భీమవరం నియోజకవర్గంలోని వీరవాసరం సెంటర్‌లో రొయ్య రైతుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ఆందోళన నిర్వహించారు. ఫీడ్ తయారీ కంపెనీలు, ఎగుమతిదారులు ఒక సిండికేట్‌గా మారి రైతుల రక్తాన్ని తాగుతున్నారని వారు నిప్పులు చెరిగారు.
కేవలం మూడు నెలల వ్యవధిలోనే రెండుసార్లు ధరలు పెంచడం వల్ల సాగు పెట్టుబడి విపరీతంగా పెరిగిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాజా పెంపు వల్ల ఒక్కో టన్ను మేతపై 8 వేల నుండి 10 వేల రూపాయల వరకు అదనపు భారం పడుతోందని, ఇది తమను అప్పుల ఊబిలోకి నెట్టడమేనని రైతులు వాపోయారు. నిరసనలో భాగంగా రైతులు రోడ్డుపై రొయ్య మేత బస్తాలను తగలబెట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఈ ధరల పెంపును ఉపసంహరింపజేయాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌లు ఈ విషయంలో వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని ఆక్వా రంగాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు.
ఆక్వా సాగుదారులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులు అత్యంత దయనీయంగా మారుతున్నాయి. అంతర్జాతీయ రాజకీయ మార్పులు, ముఖ్యంగా అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అమలవుతున్న సుంకాల విధానం వల్ల రొయ్యల ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. దీనికి తోడు రొయ్యల చెరువుల్లో కొత్త రకం వ్యాధులు వ్యాపించి దిగుబడులు గణనీయంగా తగ్గిపోవడంతో రైతులు ఇప్పటికే భారీ నష్టాల్లో ఉన్నారు.
అప్పులు తెచ్చి పెట్టుబడి పెడుతున్న రైతులకు ఇప్పుడు మేత ధరల పెరుగుదల ‘గోరుచుట్టుపై రోకలిపోటు’లా మారింది. సాగు వ్యయం పెరగడం, మార్కెట్‌లో సరైన ధర లభించకపోవడంతో ఆక్వా సాగు భారంగా మారుతోంది. ఈ సంక్షోభ సమయంలో ప్రభుత్వం తమకు అండగా నిలవకపోతే ఆక్వా రంగం కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని రైతులు హెచ్చరిస్తున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు స్పందనతో తమకు న్యాయం జరుగుతుందని ఆక్వా రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం తదుపరి తీసుకోబోయే కఠిన నిర్ణయాలపైనే వేలమంది ఆక్వా రైతుల భవిష్యత్తు ఆధారపడి ఉంది.





