మిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జోసేప్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇప్పుడు శాసనసభ కీలక పదవుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసింది. 17వ తమిళనాడు శాసనసభ స్పీకర్‌గా జేసీడీ ప్రభాకర్, డిప్యూటీ స్పీకర్‌గా రవిశంకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అసెంబ్లీ సమావేశాల రెండో రోజు ఈ ఎన్నికల ప్రక్రియ నిర్వహించబడింది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులకు ఇతర అభ్యర్థులు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఇద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ కరుపయ్య అధికారికంగా ప్రకటించారు.
స్పీకర్ ఎన్నిక సందర్భంగా అసెంబ్లీలో ప్రత్యేక వాతావరణం నెలకొంది. సభా సంప్రదాయాలకు అనుగుణంగా నూతన స్పీకర్‌ను గౌరవప్రదంగా ఆయన స్థానానికి తీసుకెళ్లే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్, ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలీన్ కలిసి జేసీడీ ప్రభాకర్‌ను స్పీకర్ కుర్చీ వద్దకు తీసుకెళ్లడం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
రాజకీయంగా ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులు కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం తమిళనాడు రాజకీయాల్లో ఆరోగ్యకర ప్రజాస్వామ్యానికి నిదర్శనంగా పలువురు అభిప్రాయపడ్డారు.కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీ కార్యకలాపాల నిర్వహణలో స్పీకర్ పాత్ర అత్యంత కీలకమైనది. ఈ నేపథ్యంలో జేసీడీ ప్రభాకర్ ఎన్నిక విజయ్ ప్రభుత్వానికి పరిపాలనా పరంగా కీలక ముందడుగుగా భావిస్తున్నారు.
డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన రవిశంకర్ కూడా అసెంబ్లీ కార్యకలాపాల్లో ముఖ్య పాత్ర పోషించనున్నారు. స్పీకర్ గైర్హాజరైన సందర్భాల్లో సభ నిర్వహణ బాధ్యతలు ఆయన చేపడతారు. రవిశంకర్ ఎన్నికపై కూడా పలువురు ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు.
స్పీకర్‌ను సీఎం విజయ్, ఉదయనిధి స్టాలిన్ కలిసి కుర్చీ వద్దకు తీసుకెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. “ఇదే ప్రజాస్వామ్య సంప్రదాయం”, “రాజకీయాలకు అతీతంగా సభా గౌరవం నిలబెట్టారు” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
17వ తమిళనాడు శాసనసభ కార్యకలాపాలపై ప్రస్తుతం ప్రజల్లో భారీ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ ముఖ్యమంత్రిగా ఎలా వ్యవహరిస్తారన్న దానిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో జరిగే ప్రతి పరిణామం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంటోంది.





