తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే జోసెఫ్ విజయ్ కీలక నిర్ణయం తీసుకుని రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు, దేవాలయాలు, బస్టాండ్ల సమీపంలో కొనసాగుతున్న 717 మద్యం దుకాణాలను తక్షణమే మూసివేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
ప్రజల నుంచి చాలాకాలంగా వస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా మహిళా సంఘాలు, తల్లిదండ్రులు, సామాజిక సంస్థలు చాలా కాలంగా ఇలాంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను కోరుతూ వచ్చాయి. ఇప్పుడు సీఎం విజయ్ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.
తమిళనాడులో పాఠశాలలు, కళాశాలలు, దేవాలయాలు, బస్టాండ్ల సమీపంలో మద్యం దుకాణాలు ఉండటంపై గతంలో అనేక విమర్శలు వచ్చాయి. విద్యార్థులపై చెడు ప్రభావం పడుతోందని, మహిళలకు అసౌకర్యం కలుగుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం విజయ్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అంశాన్ని ప్రాధాన్యంగా తీసుకుని చర్యలు ప్రారంభించడం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకున్నారు.
ప్రస్తుతం తమిళనాడులో ఈ నిర్ణయంపై ప్రజల నుంచి భారీగా స్పందన వస్తోంది. ముఖ్యంగా మహిళలు, సామాజిక కార్యకర్తలు సీఎం విజయ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. “ఇది చాలా కాలంగా ఎదురుచూస్తున్న నిర్ణయం”, “విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకున్న మంచి చర్య” అంటూ సోషల్ మీడియాలో ప్రజలు కామెంట్లు చేస్తున్నారు.
సీఎం విజయ్ తీసుకున్న నిర్ణయంపై ప్రముఖ నటుడు, రాజ్యసభ సభ్యుడు కమల హాసన్ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో స్పందించారు. “తమిళ కుటుంబాల ఆకాంక్షలను గౌరవిస్తూ, ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వెంటనే సీఎం విజయ్ తీసుకున్న ఈ చర్య ప్రశంసనీయమైనది” అని కమల్ హాసన్ పేర్కొన్నారు. అలాగే ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ తీసుకున్న ఈ నిర్ణయం సమాజంపై సానుకూల ప్రభావం చూపుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
తమిళనాడులో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మద్యం విక్రయ వ్యవస్థ అయిన టాస్మాక్‌పై గతంలో కూడా అనేక విమర్శలు వచ్చాయి. మద్యం దుకాణాల సంఖ్య తగ్గించాలని, పాఠశాలలు, దేవాలయాల సమీపంలో ఉన్న షాపులను తొలగించాలని డిమాండ్లు వినిపించాయి. ఇప్పుడు 717 దుకాణాల మూసివేతతో టాస్మాక్ వ్యవస్థపై మరోసారి పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది.





