సింగపూర్‌లోని పుంగోల్ జిల్లా తరహాలో అమరావతిలో నిర్మించబోయే ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్… ఏపీలోని ఇతర పట్టణ ప్రాంతాలకు మాత్రమే కాకుండా, భారతదేశంలోనే ఒక మోడల్ టౌన్ షిప్ గా నిలుస్తుందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఇందుకోసం ప్రపంచ బ్యాంకు నుండి అవసరమైన మద్దతు తీసుకోవడంతో పాటు విధివిధానాలను ఖరారును వేగవంతంగా చేయాల్సిందిగా జాయింట్ ఇంప్లిమెంటేషన్ వర్కింగ్ కమిటీని కోరారు.
రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ ప్రతినిధులతో సింగపూర్ లో సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ మీ మద్దతుతో అమరావతి ఆర్థిక ప్రాంతాన్ని అత్యుత్తమంగా అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం.
అమరావతి ఎకనమిక్ రీజియన్ అభివృద్ధిలో ఆసక్తిగల భాగస్వాములను ఆహ్వానిస్తూ RFP (ప్రతిపాదనల కోసం అభ్యర్థన) పై ఇప్పటికే నోటిఫికేషన్ జారీచేశాం. అమరావతి రాజధానికి ఇప్పుడు జాతీయ చట్టబద్ధత ఉంది. దీనివల్ల ఈ ప్రాంతంలో పెట్టుబడులకు ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచుతుందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి సింగపూర్ ద్వారా ఆగ్నేయాసియా, తూర్పు ఆసియాల మధ్య వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి గల అవకాశాలను పరిశీలించండి. సింగపూర్ తరహాలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక గ్లోబల్ MICE గమ్యస్థానంగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా అలాంటిది ఏర్పాటుచేసేందుకు సింగపూర్ సన్‌టెక్ సిటీని అధ్యయనం చేస్తాం. ఆంధ్రప్రదేశ్‌లో రియల్ టైమ్ గవర్నెన్స్ ను బలోపేతం చేయడానికి సింగపూర్ అనుభవాన్ని ఇకముందు కూడా ఉపయోగించుకుంటాం.
ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టిన, పెట్టడానికి సుముఖత వ్యక్తం చేస్తున్న కంపెనీలకు సానుకూల వాతావరణం ఏర్పాటు చేస్తామని లోకేష్ అన్నారు. మన రెండు ప్రభుత్వాల నడుమ ఇప్పుడు పటిష్టంగా భాగస్వామ్యం ఏర్పడింది. ఎంవోయులోని అంశాల అమలుపై వర్కింగ్ గ్రూపుల ద్వారా ప్రతినెలా సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయి. ఏపీ ప్రభుత్వానికి చెందిన ఆరుగురు మంత్రులు రెండు వారాల క్రితం సింగపూర్ – ఏపీ గవర్నెన్స్ ఎక్సలెన్స్ (SAGE) కార్యక్రమంలో భాగంగా వారంరోజులపాటు శిక్షణా తరగతులకు హాజరై పరిపాలనలో తమ అనుభవాలను పంచుకున్నారు. ఏపీకి చెందిన 37 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా తాజాగా శిక్షణను పూర్తి చేసుకున్నారు. వారి అనుభవాన్ని, శిక్షణలో నేర్చుకున్న అంశాలను మా విద్యా వ్యవస్థలో పొందుపరుస్తాం.
ఈ సమావేశంలో సింగపూర్ వాణిజ్యం, పరిశ్రమలు, విదేశాంగశాఖ మంత్రి గాన్ సియో హువాంగ్, సింగపూర్ వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వశాఖ సీనియర్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ చోంగ్, సింగపూర్ కో-ఆపరేషన్ ఎంటర్ ప్రైజ్ (SCE) డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టే లియాన్ చూ, ఎంటర్ ప్రైజ్ సింగపూర్ సౌత్ ఆసియా ఎకనమిక్ డెవలప్ మెంట్ డైరెక్టర్ ఆడ్రీ టాన్, సింగపూర్ కో-ఆపరేషన్ ఎంటర్ ప్రైజ్ మిడిల్ ఈస్ట్, నార్త్ ఆసియా డిప్యూటీ డైరెక్టర్ లిమ్ చీ కియా, మినిస్ట్రీ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ డైరెక్టర్ జీన్ యీ, సింగపూర్ కోఆపరేషన్ ఎంటర్ ప్రైజ్ సీనియర్ మేనేజర్ (మిడిల్ ఈస్ట్, నార్త్ ఆసియా) నిషా శారద, భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే, ఎస్.జోషి, ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ ఐఎఎస్ అధికారులు దత్తి సురేంద్ర, అనంత శంకర్, పీయూష్ కుమార్, కాటంనేని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.





