ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు ముందు రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. మే 10న హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ప్రధాని పాల్గొననున్న భారీ బహిరంగ సభకు ముందు, తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రధానమంత్రి మోదీకి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, దేశవ్యాప్తంగా సామాజిక న్యాయ సాధనకు సంబంధించిన నాలుగు కీలక అంశాలను వెంటనే పరిగణలోకి తీసుకోవాలని ఆమె ఆ లేఖలో కోరారు.
“ఒక బాధ్యత కలిగిన పౌరురాలిగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, వెనుకబడిన వర్గాల హక్కులను మీ దృష్టికి తీసుకువస్తున్నాను” అంటూ కవిత తన లేఖను ప్రారంభించారు. తెలంగాణ అభివృద్ధి, సామాజిక న్యాయం, వెనుకబడిన వర్గాల సాధికారతకు సంబంధించిన పలు కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
మొదటగా, తెలంగాణలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పాలమూరు –రంగారెడ్డి లిప్ట్ ఇర్రిగేషన్ స్కీమ్ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కవిత డిమాండ్ చేశారు. దక్షిణ తెలంగాణలో సాగునీటి అవసరాలను తీర్చడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని, లక్షలాది రైతుల జీవితాలను మార్చగల సామర్థ్యం దీనికి ఉందన్నారు. విభజన హామీల్లో భాగంగా తెలంగాణకు అన్యాయం జరగకుండా కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే 2027 జనాభా లెక్కల ప్రక్రియలో ప్రత్యేక ఓబీసీ కాలమ్‌ను చేర్చాలని కవిత కోరారు. దేశవ్యాప్తంగా వెనుకబడిన తరగతుల అసలు జనాభా గణాంకాలు వెలుగులోకి రావాలంటే కుల ఆధారిత జనగణన అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. ఓబీసీల సామాజిక, ఆర్థిక పరిస్థితులపై సరైన డేటా లేకపోవడం వల్ల వారికి తగిన న్యాయం జరగడం లేదన్నారు.
మహిళలకు రాజకీయాల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించాలంటే ఓబీసీ మహిళలకు ప్రత్యేక ఉపకోటా తప్పనిసరిగా ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. అందుకే ఓబీసీ ఉపకోటాతో మహిళా రిజర్వేషన్ బిల్లును తిరిగి ప్రవేశపెట్టాలని ప్రధాని మోదీని ఆమె కోరారు.
తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల అభివృద్ధి కోసం తీసుకొచ్చిన బీసీ బిల్లులకు రాష్ట్రపతి ఆమోద ప్రక్రియను వేగవంతం చేయాలని కవిత విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులు ఆలస్యమవుతుండటంతో వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ఆటంకం కలుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో చొరవ చూపి త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కోరారు.
ప్రధానమంత్రి తెలంగాణ పర్యటనకు ముందు ఈ లేఖ విడుదల కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా బీసీ, ఓబీసీ అంశాలను ముందుకు తెచ్చి రాజకీయ ఒత్తిడి పెంచే ప్రయత్నంగా రాజకీయ కవిత ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లో భారీ భద్రతా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే నగరంలో హై అలర్ట్ ప్రకటించి, భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.





