తమిళనాడు రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రి కళగం ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించగా.. కాంగ్రెస్‌తో పాటు వామపక్షాలు, వీసీకే మద్దతు తెలపడంతో ప్రభుత్వం ఏర్పాటు దిశగా మార్గం సుగమమైంది.
శుక్రవారం సాయంత్రం రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను విజయ్ రాజ్‌భవన్‌లో కలిసి మద్దతు లేఖలను సమర్పించారు. మూడు రోజుల వ్యవధిలో మూడోసారి గవర్నర్‌ను కలిసిన ఆయన.. ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరారు. అనంతరం గవర్నర్ టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకారం తెలపడంతో శనివారం ఉదయం 11 గంటలకు విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 107 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. అనంతరం కాంగ్రెస్ ఐదు స్థానాలతో మద్దతు ప్రకటించింది. తాజాగా సీపీఐ, సీపీఎం, వీసీకే (విడుదతలై చిరుతైగల్ కట్చి) కూడా సమ్మతి తెలపడంతో టీవీకే కూటమి మెజార్టీ మార్కును చేరుకుంది. పార్టీల వారీగా సంఖ్యాబలాలు పరిశీలిస్తే టీవీకేకు 107 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. కాంగ్రెస్‌కు 5, సీపీఐకి 2, సీపీఎంకు 2, వీసీకేకు 2 స్థానాలు ఉన్నాయి. ఈ మద్దతుతో అసెంబ్లీలో టీవీకే ప్రభుత్వం సునాయాసంగా బలపరీక్షను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది.
ఇక ప్రభుత్వంలో భాగస్వామ్యం విషయంలో వామపక్షాలు కీలక ప్రకటన చేశాయి. టీవీకే ప్రభుత్వానికి బయట నుంచే మద్దతు ఇస్తామని, మంత్రివర్గంలో మాత్రం చేరబోమని సీపీఎం రాష్ట్ర నేత యూ వాసుకి స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీపీఐ, సీపీఎం రాష్ట్ర కమిటీలు సమావేశమై టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు బయటి నుంచి మద్దతు ఇవ్వాలని నిర్ణయించాయని తెలిపారు. అసెంబ్లీలో బలపరీక్ష సమయంలో టీవీకేకు అనుకూలంగా ఓటు వేస్తామని.. అయితే ప్రభుత్వంలో చేరే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల ఆధారంగానే వామపక్షాలు స్వతంత్రంగా వ్యవహరిస్తాయని పేర్కొన్నారు.





