తెలంగాణ చేనేత వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ, నేతన్నల కష్టానికి తగిన గౌరవం తీసుకురావాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న “చేనేత వస్త్ర ప్రదర్శన–2026” నగరంలో అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత & జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ప్రదర్శనను ఘనంగా ప్రారంభించారు. పది రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నేత కార్మికులు తమ అద్భుత కళాఖండాలను ప్రదర్శించనున్నారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో చేనేత & జౌళిశాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, ఇతర ఉన్నతాధికారులు, చేనేత సంఘాల ప్రతినిధులు, కళాకారులు, పెద్ద సంఖ్యలో సందర్శకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం చేనేత రంగ పునరుద్ధరణకు అనేక వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. గతంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నేతన్న కుటుంబాలు, ప్రస్తుతం ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నాయని తెలిపారు.
“చేనేత అనేది కేవలం ఒక వృత్తి కాదు.. అది తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం, సృజనాత్మకతకు ప్రతీక. నేతన్న చేతిలో నూలుపోగు తిరిగితే వేల కుటుంబాల్లో వెలుగు వెలుగుతుంది” అని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇలాంటి ప్రదర్శనలు కేవలం అమ్మకాల వేదికలు మాత్రమే కాకుండా, గ్రామీణ కళాకారుల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసే మహత్తర వేదికలని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న “ఇందిరమ్మ చీరలు” పథకం చేనేత రంగానికి గొప్ప ఊతమిచ్చిందని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలకు నాణ్యమైన చీరలను అందించడం ద్వారా నేతన్నల ఇళ్లలో ఆర్థిక స్థిరత్వం ఏర్పడిందన్నారు. ఇప్పటికే రెండో డిజైన్‌కు సంబంధించిన పనులు కూడా పూర్తయ్యాయని మంత్రి వెల్లడించారు. ఈ పథకం వల్ల హ్యాండ్లూమ్, పవర్లూమ్ కార్మికులకు నిరంతర ఉపాధి లభిస్తోందని, వేలాది కుటుంబాలు ప్రభుత్వంపై విశ్వాసంతో జీవనం సాగిస్తున్నాయని పేర్కొన్నారు.
ప్రపంచ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా చేనేత రంగాన్ని తీర్చిదిద్దేందుకు హైదరాబాద్‌లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (IIHT) ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ సంస్థ ద్వారా యువతకు ఆధునిక డిజైనింగ్, ఫ్యాషన్ టెక్నాలజీ, మార్కెటింగ్, డిజిటల్ నైపుణ్యాలపై శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. “సంప్రదాయ కళను ఆధునిక సాంకేతికతతో మేళవిస్తేనే మన చేనేత ప్రపంచస్థాయిలో నిలుస్తుంది. యువత చేనేత రంగాన్ని ఉపాధి అవకాశంగా స్వీకరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది” అని అన్నారు.





