తమిళనాడులో మొత్తం అసెంబ్లీ స్థానాలకు, అలాగే పశ్చిమ బెంగాల్లో తొలి విడత ఎన్నికలకు నిన్న పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్‌లో అనూహ్యంగా భారీ స్థాయిలో ఓటింగ్ నమోదు కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
తమిళనాడులో 84.80 శాతం, పశ్చిమ బెంగాల్‌లో 91.91 శాతం పోలింగ్ నమోదవడం గమనార్హం. ఈ స్థాయి ఓటింగ్ సాధారణంగా అరుదుగా కనిపించడంతో, ప్రస్తుత అధికార పార్టీల్లో కొంత ఆందోళన నెలకొంది. అధిక ఓటింగ్ శాతం ప్రభుత్వాలకు అనుకూలంగా మారుతుందా? లేక ప్రజల్లో ఉన్న అసంతృప్తి కారణంగా వ్యతిరేకంగా మారుతుందా? అన్న అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.
ఈ పరిణామాలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు స్పందించారు. భారీ స్థాయిలో పోలింగ్ జరగడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవడం సానుకూల పరిణామమని పేర్కొన్నారు.
రామచందర్ రావు మాట్లాడుతూ, ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ జరగడం ప్రజలు ప్రస్తుత వ్యవస్థలో మార్పును కోరుకుంటున్నారనే సంకేతంగా భావించవచ్చన్నారు. సాధారణంగా అధిక ఓటింగ్ శాతం మార్పుకు దారితీసే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఓట్లు ప్రభుత్వాల మార్పు కోసమే పడి ఉండవచ్చని కూడా సూచించారు.
అధిక ఓటింగ్ అనేది రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చని, ఒకవైపు ప్రజలు ప్రభుత్వ పనితీరుకు మద్దతుగా పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి ఓటు వేసి ఉండవచ్చు. లేదా అసంతృప్తి వ్యక్తం చేయడానికి కూడా అధికంగా ఓటింగ్ ఉండవచ్చని ఆయన అభిప్రాయపడుతున్నారు.
పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ పరిస్థితులు, పోటీ తీవ్రత కారణంగా ప్రజలు భారీగా పోలింగ్ కేంద్రాలకు వచ్చారని, అలాగే తమిళనాడులో కూడా ప్రధాన పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉండటంతో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు.
ఈ భారీ పోలింగ్ ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఈ చర్చ కొనసాగనుంది. అధికార పార్టీలు, ప్రతిపక్షాలు తమ తమ అంచనాలను వేసుకుంటూ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాయి.





