హైడ్రా కేవలం పేదల ఇళ్లను కూల్చడానికేనా? : హరీశ్ రావుకు

Must read

రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం, నాదర్గుల్ పరిధిలోని సర్వే నంబర్ 613 (119) కాసుబాగ్ కంచలో ఉన్న 373 ఎకరాల, వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న రియల్ ఎస్టేట్ మాఫియా దాడులు, పోలీసుల వేధింపుల నుంచి తమను రక్షించాలని కోరుతూ నాదర్గుల్ కు చెందిన వందలాది మంది రైతులు మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావుని కలిశారు.

కబ్జాదారులు వేసిన కంచెలు, ధ్వంసమైన తమ వ్యవసాయ బోర్లు, దాడుల్లో గాయపడిన ఫొటోలు, వీడియోలను హరీశ్ రావుకు చూపించి తమ గోసను వెళ్లబోసుకున్నారు. రైతుల సమస్యలు విన్న హరీశ్ రావు తక్షణమే ఉన్నతాధికారులకు ఫోన్ చేసి కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా హరీశ్ రావు గారు మాట్లాడుతూ.. నాదర్గుల్ భూములు అన్యాక్రాంతం కాకుండా గతంలో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద హైకోర్టు వరకు న్యాయపోరాటం చేసిందని గుర్తుచేశారు. ఆ భూములు ప్రభుత్వానివే అని ప్రస్తుత ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసిందన్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల అండదండలతోనే ప్రైవేట్ వ్యక్తులకు ఈ భూములను ధారాదత్తం చేసే కుట్ర జరుగుతోందని ఆయన మండిపడ్డారు.

ప్రభుత్వ భూములు, చెరువుల రక్షణ కోసమే హైడ్రా తీసుకొచ్చామని గొప్పలు చెబుతున్న ముఖ్యమంత్రి.. నాదర్గుల్ లోని వేల కోట్ల ప్రభుత్వ భూమి, అందులోని చెరువును రియల్ ఎస్టేట్ రాబందులు కబ్జా చేస్తుంటే ఎందుకు నిద్రపోతున్నారు? హైడ్రా కేవలం పేదల ఇళ్లను కూల్చడానికేనా? ప్రభుత్వ పెద్దల అండదండలతో ప్రభుత్వ భూములను, అందులోని చెరువులను, ఫీడర్ ఛానల్ ను ధ్వంసం చేస్తూ కంచెలు వేసి కబ్జా చేస్తున్న బడా రియల్ ఎస్టేట్ సంస్థల వైపు కన్నెత్తి చూసే దమ్ము హైడ్రాకు ఉందా? అని ధ్వజమెత్తారు.

రైతుల ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన హరీశ్ రావు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, సీపీ సజ్జనార్, స్థానిక ఆర్డీవో, ఎమ్మార్వోలకు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు.

కలెక్టర్,ఆర్డీవోలతో హరీశ్ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ సీలింగ్ భూములకు కలెక్టర్, ఆర్డీవోలే కస్టోడియన్లుగా ఉంటారు. ఇది ప్రభుత్వ భూమి అని సుప్రీంకోర్టులో మీరే ఫైల్ చేశారు. ఇప్పుడు ప్రైవేట్ వాళ్లు కంచెలు వేస్తుంటే మీరెందుకు మౌనంగా ఉన్నారు.. వెంటనే ఆ కంచెలు తొలగించి, తాతల కాలం నుంచి వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు మళ్లీ సాగు చేసుకునే అవకాశం కల్పించండి. ముదిరాజ్ లకు చెరువులో చేపలు పట్టుకునే హక్కును కల్పించి, చెరువుకు వెళ్లే ఫీడర్ ఛానళ్లను ధ్వంసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోండి. గుడిలో పూజలు చేసుకునేందుకు ప్రజలను అనుమతించాలని అధికారులను కోరారు.

ఎమ్మార్వోతో మాట్లాడుతూ.. అది ప్రభుత్వ భూమి అయినప్పుడు, అందులోకి అక్రమంగా ప్రవేశించిన ప్రైవేట్ వ్యక్తులు, రౌడీలపై ప్రభుత్వ అధికారిగా ఎమ్మార్వో పోలీస్ స్టేషన్లో ఎందుకు కంప్లైంట్ ఇవ్వడం లేదు? వెంటనే కబ్జాదారులను వెళ్లగొట్టి వాళ్లపై కేసు పెట్టండి అని సూచించారు.

సీపీ సజ్జనార్ తో హరీష్ రావు మాట్లాడుతూ.. ఆదిభట్ల పోలీసులు రియల్ ఎస్టేట్ మాఫియాకు కొమ్ముకాస్తున్నారు. రైతులు ఫిర్యాదు ఇస్తే తీసుకోవడం లేదు. పైగా రైతులపైనే దొంగ కేసులు పెడుతున్నారు. గుడికి, చెరువుకు వెళ్తున్న స్థానికులపై దాడి చేసిన కబ్జాదారుల రౌడీలపై వెంటనే కేసులు నమోదు చేసి రైతులను రక్షించాలి. రైతుల తరపున కూడా పోలీస్ స్టేషన్లో కేసులు తీసుకునేలా చర్యలు తీసుకోవాలి అని కోరారు.

రైతులకు న్యాయం జరగని పక్షంలో తానే స్వయంగా బీఆర్ఎస్ పార్టీ బృందంతో నాదర్గుల్ భూములను సందర్శిస్తానని అధికారులకు తేల్చిచెప్పారు. దీంతో తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని హరీష్​ రావుకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!