ఆలోచనలు ప్రవహిస్తున్నాయి
మనసు మడుల్ని మెల్లగా తడుపుతూ,
నిశ్శబ్దపు నేలలో సేద్యం చేస్తూ
నూతన భావాల్ని మొలిపిస్తూ॥
అక్షరాలు ప్రవహిస్తున్నాయి
కలమునుండి కాంతులై జారిపడుతూ,
మాటలుగా మారుతూ
మనసుల మధ్య వంతెనలవుతూ॥
కవితలు ప్రవహిస్తున్నాయి
హృదయ తంతుల్ని హత్తుకుంటూ,
భావ బిందువులను కారుస్తూ
అనంత సముద్రమై విస్తరిస్తూ॥
ప్రశంసలు ప్రవహిస్తున్నాయి
పలుకుల పూలై పరిమళిస్తూ,
కవి హృదయంలో తృప్తి నింపుతూ
మరో కవితకు కిరణమవుతూ॥
సాహితీ నదులు ప్రవహిస్తున్నాయి
తీరాల్ని తాకుతూ,
రాళ్లను రాసుకుంటూ
గమ్యాన్ని చేరాలని తపిస్తూ॥
కవన కాంతులు ప్రవహిస్తున్నాయి
చీకట్ల గూటిని చీల్చుకుంటూ,
జీవితం వైపు అడుగులేస్తూ
కొత్త దారిని చూపిస్తూ॥
ప్రవాహమంటే—
ఆగని ఆత్మయాత్ర,
ప్రతి చలనం ఒక సృష్టి,
ప్రతి ప్రవాహం ఒక కొత్త జీవితం॥
— గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం





