“శీను గాడు ఏం చేస్తున్నాడు?” సాయంత్రపు అలసటతో ఇంట్లోకి అడుగుపెట్టగానే అడిగాడు శివన్న. “పోరడు సదువుకుంటున్నడు ఇంట్లనే ఉన్నడే, ఏమైంది?” అని ఆందోళనగా అడిగింది లచ్చిమి. శివన్న కాళ్లను చాచుకుంటూ,”ఈరోజు పని చాలా గట్టిగైంది . పానం అలకగ లేదు ఒక్క సీసా కల్లుబొట్టు తాగితే ఇంత నిద్ర వడుతది గొంత తిండి వోతది . శీనుని పంపించు” అన్నాడు. పదో తరగతి చదువుతున్న శీను ఆ మాటలు విని కాసేపు ఆగాడు.నాన్నకి సహాయం చేస్తున్నాననే భావనతో వెళ్లి సీసా తెచ్చి ఇచ్చాడు. అది తన జీవితంలో మొదటి సారి కళ్ళు కాంపౌండులోకి వెళ్లడం కానీ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అతనికి తెలియదు.
మరుసటి రోజు.
స్కూల్ ముగిసింది. ఇంటికి వెళ్లే దారిలో స్నేహితులు పిలిచారు. పాడుబడ్డ ఇంటి వెనుక గోడల మధ్య పొగలు గింగిరాలు తిరుగుతున్నాయి. “రారా శీనుగా ,ఒకసారి ట్రై చేయ్. మస్తు ఉంటది మజా అనిపిస్తదిరా ఏం గాదు రారా బై !”
పిల్లల చేతుల్లో పీక ముక్కలు, కొత్తగా ప్రయత్నిస్తున్న వాళ్లు దగ్గులతో ఇబ్బంది పడుతుంటే, ఇంకొకడు అనుభవశాలి కావచ్చు స్టైల్‌గా పొగను వదులుతూ “నీ యవ్వ తగ్గేదేలే…..” అంటూ నవ్వుతున్నాడు. శీను చేతులు వణికాయి. “ఇది తప్పు” అనిపించింది. “ఏం కాదు” అన్న స్నేహితుల మాటలే గెలిచాయి. మెల్లిగా పీక ముక్కను పెదవులకు చేర్చాడు. అతని బాల్యం అక్కడే కాస్త మసకబారింది. రోజులు గడిచాయి, పొగ సరదాగా మొదలై అలవాటుగా మారింది. అబద్ధాలు మాటల్లోకి వచ్చాయి.సులభంగా అబద్దాలు ఆడే స్థాయికి వచ్చారు.
ఒక రోజు స్కూల్లో…
వ్యాయామ మాస్టారు బ్యాగులు చెక్ చేయగా నిజం బయటపడింది. బెత్తం వేసిన నొప్పికంటే తప్పు చేసిన అపరాధ భావనే పిల్లల గుండెల్లో ఎక్కువగా గుచ్చుకుంది. ఆ రాత్రి మళ్లీ నాన్న సీసా కోసం పంపాడు. ఈసారి శీను నిశ్శబ్దంగా స్నేహితుల దగ్గరకు వెళ్లివాళ్ళతో కలిసి తాగాడు. సీసాలో నీళ్లు కలిపి ఇంటికి తెచ్చాడు.అనుమానం రాకుండా, మొత్తానికి రుచి మారింది కావచ్చు అని అలాగే తాగేసాడు వాళ్ళ నాన్న. చీకటిలో నిద్ర పోకుండా ఆలోచన చేస్తున్నాడు. “నేను ఏం చేస్తున్నాను?” అనే ప్రశ్నతో నిద్ర పట్టడం లేదు. చాలా రోజుల నుండి పిల్లలలో వస్తున్న మార్పులు గమనిస్తున్న సోషల్ టీచర్ ఒకానొక రోజు స్వయంగా కళ్లతో చూసాడు, లేత పిల్లలు చెడు అలవాట్లతో నాశనం కావడం మనసుకు బాధ అనిపించింది, ఆ రాత్రి సరిగ్గా నిద్రపోలేకపోయాడు. “ఈ పిల్లలు మారాలి!! ఇప్పుడే మారాలి” అని నిశ్చయించుకున్నాడు.
మరుసటి రోజు
పిల్లలతో కలిసి కూర్చుని భోజనం చేస్తూ మృదువుగా అడిగాడు: “ఏమయ్యా , ఈ మధ్య మీలో మార్పు కనిపిస్తోంది. ఏమైనా చెప్పాలనిపించట్లేదా నాతో?”పిల్లలు తలలు వంచారు. నిజం గొంతులో ఇరుక్కుపోయింది.మౌనంగా ఉన్నారు.
సరే పిల్లలు సాయంత్రం మీ ఇంటికి వస్తాను, ఊరికే సరేనా కంగారు పడవద్దు, నాతో మీరు ఏ సమస్య అయినా చెప్పవచ్చు, నేను మీ ఉపాధ్యాయున్ని మీ క్షేమం కోసమే తాపత్రయపడే మీ గురువుని అర్ధం అయింది కదా పిల్లలు.సాయంత్రం తల్లిదండ్రులందరినీ ఒకచోటికి చేర్చాడు మాస్టారు. “మీ పిల్లలు చెడు అలవాట్లకు దగ్గరవుతున్నారు. కొన్ని దుర అలవాట్లు బయట నుంచే కాదు, ఇంట్లో నుండే మొదలవుతున్నాయి, పిల్లలు మిమ్మల్ని మమ్మల్ని కూడ అనుకరిస్తారు, అనుసరిస్తారు. మీరు మేము చేసే ప్రతి పని వాళ్లకు ఒక పాఠమే.” శివన్న చేతిలో ఉన్న కల్లు సీసా ఒక్కసారిగా భారంగా అనిపించింది. తన కొడుకు కోసం తాను మారాలి అనిపించింది. లచ్చిమి కళ్లలో నీళ్లు తిరిగాయి. “మన తప్పేనా?” అనే నిశ్శబ్ద ప్రశ్న. అదే ప్రశ్న అందరిలో కూడ. అక్కడా ఉన్న చాలా మంది తల్లిదండ్రులు బీడీ, సిగరెట్,గుట్కా కల్లు లాంటివి పిల్లలతో తెప్పించుకోవద్దు, పిల్లల ముందు తీసుకోవద్దు ముఖ్యంగా మెల్లమెల్లిగా ఈ పాడు అలవాట్లు తగ్గించుకొని పూర్తిగా మానేయాలని నిశ్చయించుకున్నారు. పిల్లలతో కలిసి నడుస్తూ మాస్టారు ఆగి అన్నాడు: “పిల్లలూ పెద్ద ఓడను ముంచేది పెద్ద అల కాదు, చిన్న రంధ్రం.కేవలం చిన్న రంధ్రం.మన జీవితంలో చెడు అలవాట్లు చెడు ఆలోచనలు ఆ రంధ్రం లాంటివి.” అర్ధం అయింది అనుకుంటున్న. శీను కళ్లలో నీళ్లు తిరిగాయి “మీ అమ్మానాన్నలు మీ కోసం కష్టపడుతున్నారు. మీరు వాళ్ల ఆశలు వాళ్ల భవిష్యత్తు చేతికి వచ్చిన కొడుకు తండ్రికి సగం బలం ఇంకో చేయి ఆ బలం ఇంకా బలంగా ఉండాలి మీరు మానసికంగా శారీరకంగా బలంగా తయారు కావాలి .” మాస్టారు చేయి చాపాడు.. “మాట ఇస్తారా? ఇకపై చెడు అలవాట్లకు దగ్గర వెళ్లమని ” పిల్లలు ఒక్కొక్కరూ చేతులు చాపారు.శీను చేయి గట్టిగా పట్టుకున్నాడు.
“మాట ఇస్తున్నాం మాస్టారు……” అని ఒకే స్వరమై ఒకే సంకల్పముతో పలికారు. ఆ క్షణంమింగాలని కోరలు సాస్తూ వచ్చిన పొగలు పిల్లల స్వరానికి భయపడి దూరంగా జారుకున్నాయి పిల్లల జీవితాల్లో మార్పు.. మార్పు అప్పుడు మొదలైంది.
అకిరా ( కలం పేరు )
9346727719




