దేశ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. ఆమ్ ఆద్మీ పార్టీకు చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు అధికారికంగా బీజేపీ పార్లమెంటరీ పార్టీలో విలీనమయ్యారు. ఈ పరిణామం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ విలీనాన్ని రాజ్యసభ చైర్మన్ ఆమోదించినట్లు కిరన్ రిజీజు వేదికగా ప్రకటించారు. ఆయన చేసిన ప్రకటనతో ఈ విషయం ఒక్కసారిగా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. రాజ్యసభలో పార్టీ బలం, రాజకీయ సమీకరణాలపై ఈ నిర్ణయం ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
కిరణ్ రిజిజు మాట్లాడుతూ, బీజేపీలో చేరిన ఈ ఏడుగురు ఎంపీలు క్రమశిక్షణ కలిగిన నాయకులని కొనియాడారు. పార్లమెంటరీ వ్యవస్థలో నిబంధనలకు లోబడి పనిచేసే నేతలని ఆయన పేర్కొన్నారు. దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని వారిని ఆహ్వానించారు. ప్రధాని మోదీ అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, పాలన విధానాలు వారికి ప్రేరణగా నిలిచాయని రిజిజు అభిప్రాయపడ్డారు.
ఇదే సమయంలో విపక్షాలపై కూడా ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా ప్రతిపక్షాల ‘ఇండి’ కూటమిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. “తుక్డే-తుక్డే ఇండి అలయన్స్‌కు గుడ్ బై చెప్పే సమయం వచ్చింది” అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి.
దీంతో ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. ఒకేసారి ఏడుగురు రాజ్యసభ సభ్యులు పార్టీని వీడటం ఆ పార్టీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. బీజేపీకి ఇది రాజకీయంగా బలం చేకూర్చే అంశం.
రాజ్యసభలో సంఖ్యాబలం పరంగా కూడా ఈ మార్పులు కీలకంగా మారే అవకాశం ఉంది. భవిష్యత్తులో చట్టాల ఆమోదం, రాజకీయ నిర్ణయాలపై ఈ పరిణామం ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.
ఈ విలీనంపై ఆమ్ ఆద్మీ పార్టీ లేదా ఇతర విపక్షాల నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. ఈ పరిణామం నేపథ్యంలో జాతీయ రాజకీయాలు మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.





