ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన ఇంధన కొరతపై రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ సరఫరా లోపం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, వై ఎస్ శర్మిలా కూటమి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు గుప్పించారు. ఇంధన సంక్షోభాన్ని నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె ఆరోపించారు.
షర్మిలా మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిస్థితి అత్యంత దారుణంగా మారిందని పేర్కొన్నారు. “పెట్రోల్ లేదు.. డీజిల్ లేదు.. అసలు రాష్ట్రంలో ప్రభుత్వమే లేదు” అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రజలకు కనీస అవసరమైన ఇంధనాన్ని కూడా అందించలేని ప్రభుత్వం, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడటం విచిత్రమని అన్నారు.
ఈ సందర్భంగా ఆమె కూటమి ప్రభుత్వ పనితీరును ఎద్దేవా చేస్తూ, “ఉట్టికి ఎగరలేనమ్మ.. ఆకాశానికి ఎగురుతా అన్నట్లుంది” అని వ్యాఖ్యానించారు. ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చడంలో విఫలమై, పెద్ద పెద్ద హామీలు ఇవ్వడం సరికాదని ఆమె విమర్శించారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయని, ఎండలో ప్రజలు కిలోమీటర్ల మేర నిలబడి ఇంధనం కోసం వేచి చూడాల్సి వస్తోందన్నారు. ఈ పరిస్థితి ప్రజల రోజువారీ జీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోందని షర్మిలా పేర్కొన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంధన కొరత ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడటం బాధాకరమన్నారు. ఈ పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందేనని, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు.
ప్రజలు పడుతున్న ఇబ్బందులను వర్ణించలేని, ఈ సంక్షోభాన్ని తక్షణమే పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఇంధన సరఫరాను సక్రమంగా నిర్వహించడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం ప్రజలకు శాపంగా మారిందని ఆమె తీవ్ర విమర్శలు చేశారు.





