రిటైర్డ్ ఉద్యోగులకు అందవలసిన పదవీ విరమణ ప్రయోజనాల చెల్లింపులో జరుగుతున్న జాప్యంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న ఆలస్యాలు, నిర్లక్ష్యం కారణంగా ఉద్యోగులు తమ హక్కైన బెనిఫిట్స్ కోసం కోర్టులను ఆశ్రయించాల్సి రావడం బాధాకరమని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ పరిణామం రాష్ట్ర పరిపాలనా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
రంగారెడ్డి జిల్లా కోర్టులో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా పనిచేసి ఆరు నెలల క్రితం రిటైర్ అయిన విజయ్ కుమార్ అనే ఉద్యోగికి రావాల్సిన సుమారు రూ. 90 లక్షల పదవీ విరమణ ప్రయోజనాలు ఇప్పటికీ అందలేదు. తనకు రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని పలుమార్లు సంబంధిత అధికారులను సంప్రదించినప్పటికీ ఫలితం లేకపోవడంతో, చివరకు ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, తెలంగాణ ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టింది. రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బెనిఫిట్స్‌ను సమయానికి ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేసింది. ఈ విషయంలో నిర్లక్ష్యం అనవసరమైన న్యాయ వివాదాలకు దారితీస్తుందని పేర్కొంది.
న్యాయస్థానం ముఖ్యంగా ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శికి కఠిన ఆదేశాలు జారీ చేసింది. సంబంధిత అధికారుల నుండి పూర్తి వివరాలు సేకరించి, వెంటనే చెల్లింపులు చేయాలని ఆదేశించింది. భవిష్యత్తులో ఇలాంటి జాప్యాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ కేసును ఉదాహరణగా తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇతర రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది.
రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆలస్యం ఉద్యోగుల ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పదవీ విరమణ అనంతరం జీవనోపాధి కోసం ఈ బెనిఫిట్స్ ఎంతో కీలకం. ఇలాంటి పరిస్థితుల్లో చెల్లింపులు ఆలస్యం కావడం వల్ల ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారని వ్యాఖ్యనించింది.
ఇక ఉద్యోగ సంఘాలు కూడా ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వానికి పలు మార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని వారు అంటున్నారు. హైకోర్టు తాజా ఆదేశాలతో అయినా పరిస్థితి మారుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.





