ప్రాణాలు తీసిన రీల్స్ వ్యామోహం

Must read

సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎంతగా పెరిగిందో తెలియజేసే విషాద ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. రీల్స్ ద్వారా గుర్తింపు పొందాలని ప్రయత్నించిన ఓ 14 ఏళ్ల బాలుడు ప్రమాదకర స్టంట్ చేస్తూ ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటన హైదరాబాద్ నగర పరిధిలోని నాచారం ప్రాంతంలో జరిగింది.

మల్లాపూర్ గాంధీ బొమ్మ సమీపంలోని బస్తీలో నివసిస్తున్న మిథున్ అనే బాలుడు సోషల్ మీడియాలో ప్రసిద్ధి పొందాలనే ఆశతో ప్రమాదకరమైన స్టంట్స్ చేయడం ప్రారంభించాడు. ఇన్​ స్టా, యూట్యూబ్, ఫెస్​ బూక్​ వంటి సామాజిక మాధ్యమాల్లో రీల్స్, వీడియోలు పోస్ట్ చేసి గుర్తింపు సంపాదించాలని అతను ప్రయత్నించినట్లు సమాచారం.

ఈ క్రమంలో తన ఇంటి బాల్కనీ రెయిలింగ్‌పై ఫీట్ చేయడానికి ప్రయత్నించిన మిథున్, అదుపు తప్పి కిందపడిపోయాడు. తీవ్ర గాయాలతో ఉన్న అతన్ని కుటుంబ సభ్యులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయ స్థితిలో అతనికి వైద్యులు చికిత్స అందించినప్పటికీ, మిథున్ మృతి చెందాడు. ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

మిథున్ మృతి అతని కుటుంబాన్ని శోకసముద్రంలో ముంచేసింది. చిన్న వయసులోనే ఇలాంటి విషాదం చోటుచేసుకోవడం సమాజాన్ని కుదిపేస్తోంది. బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ, సోషల్ మీడియా వ్యామోహం ఎంత ప్రమాదకరమో గుర్తించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

ఇటీవల కాలంలో సోషల్ మీడియా రీల్స్, షార్ట్ వీడియోలపై యువతలో ఆసక్తి విపరీతంగా పెరిగింది. ఎక్కువ వ్యూస్, లైక్స్ కోసం ప్రమాదకర స్టంట్స్ చేయడానికి కొందరు యువకులు వెనుకాడటం లేదు. ఈ నేపథ్యంలో ఇటువంటి ఘటనలు వరుసగా వెలుగుచూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

తల్లిదండ్రులు తమ పిల్లలపై మరింత పర్యవేక్షణ ఉంచాలని, సోషల్ మీడియా వినియోగంపై అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు. అలాగే పాఠశాలలు, సామాజిక సంస్థలు కూడా ఈ విషయంలో చైతన్య కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!