తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుత ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా కొత్త శక్తిగా ఎదగాలనే లక్ష్యంతో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన కొత్త రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 25వ తేదీన మేడ్చల్ జిల్లా మునీరాబాద్ వేదికగా కొత్త రాజకీయ పార్టీని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు ఆమె అధికారికంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, తన కొత్త పార్టీ యువతకు, తెలంగాణ ఉద్యమకారులకు ప్రధాన ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో యువత ఆకాంక్షలు, నిరుద్యోగ సమస్యలు, అభివృద్ధి అంశాలను కేంద్రంగా చేసుకుని పార్టీ పనిచేస్తుందని తెలిపారు. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులకు సరైన గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ పరిస్థితులను విమర్శిస్తూ, కవిత కాంగ్రెస్, భారత్ రాష్ట్ర సమితి పార్టీలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు.
జగిత్యాలలో జరిగిన బీఆర్ఎస్ సభలో సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీలో చేరిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ, కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని కవిత అన్నారు. 75 ఏళ్ల వయస్సు గల నాయకుడిని పార్టీలో చేర్చుకుని, ఆయనకు 25 ఏళ్లు తగ్గిపోయాయని, నవ యువకుడిగా అద్భుతాలు చేస్తారని చెప్పడం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమని విమర్శించారు.
అలాంటప్పుడు రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగ యువకులు ఏమవ్వాలని కవిత ప్రశ్నించారు. యువత సమస్యలను గుర్తించడంలో బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. యువతకు అవకాశాలు కల్పించకుండా, పాత నాయకులను ప్రోత్సహించడం ద్వారా పార్టీ తన అసలు లక్ష్యాలను కోల్పోయిందని అన్నారు.
బీఆర్ ఎస్ లో జీవన్ రెడ్డి చేరికపై కూడా ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తిని పార్టీలో చేర్చుకుని, తెలంగాణ పునర్నిర్మాణం గురించి మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించే చర్యగా పేర్కొన్నారు.





