పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత సమీపిస్తున్న వేళ రాజకీయ ప్రచారం ఉత్కంఠభరితంగా మారింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధికార తృణమూల్ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలకు పిలుపునిస్తూ, పలు కీలక హామీలు ఇచ్చారు.
రాష్ట్ర రాజకీయాల్లో మత, అభివృద్ధి, భద్రత అంశాలను ముందుకు తెస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.సల్‌బోని, కుల్టీ ప్రాంతాల్లో నిర్వహించిన భారీ ఎన్నికల సభల్లో అమిత్ షా మాట్లాడారు. ఒకప్పుడు పారిశ్రామిక కేంద్రంగా పేరుగాంచిన కుల్టీ ప్రాంతం ప్రస్తుతం క్షీణించిందని అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల వల్ల పరిశ్రమలు దెబ్బతిన్నాయని విమర్శించారు.
అక్రమ మైనింగ్ పెరిగిపోయిందని, పర్యావరణ కాలుష్యం అధికమైందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే పరిశ్రమలను పునరుద్ధరిస్తామని, కాలుష్య నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన చేసిన రామమందిరం, బాబ్రీ మసీదు వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీశాయి. బీజేపీ ప్రభుత్వం రామమందిరం నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్తే, టీఎంసీ అనుబంధ వర్గాలు బాబ్రీ మసీదు నిర్మాణానికి మద్దతు ఇస్తున్నాయని ఆరోపించారు. బంగాల్ భారత్‌లో భాగమని, దేశ విభజనకు దారితీసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కింది.
యువతకు ఉపాధి కల్పనపై కూడా అమిత్ షా కీలక హామీ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ప్రతి సంవత్సరం లక్ష మందికి మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగాల్లో అవినీతి పెరిగిపోయిందని, అర్హుల అవకాశాలను అనర్హులకు విక్రయిస్తున్నారని ఆరోపించారు.
పారదర్శక నియామక వ్యవస్థను తీసుకువస్తామని చెప్పారు.మరో కీలక అంశంగా యూనిఫాం సివిల్ కోడ్‌ను ప్రస్తావించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేస్తామని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించడం లక్ష్యమని పేర్కొన్నారు. బహుళ వివాహాలపై నిషేధం విధిస్తామని స్పష్టం చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కొన్ని వర్గాలను ప్రోత్సహిస్తున్నారని టీఎంసీపై విమర్శలు గుప్పించారు.





