ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ పుస్తకావిష్కరణ జరిగింది. సీనియర్ జర్నలిస్ట్ టీడీ ప్రసాద్ రచించిన “అజేయుడు” అనే పుస్తకాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం మంగళవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి పలువురు సీనియర్ పాత్రికేయులు, మీడియా ప్రతినిధులు హాజరై రచయితకు అభినందనలు తెలిపారు. ఆవిష్కరన అనంతరం మంత్రి పార్థసారధి మాట్లాడుతూ, “అజేయుడు” అనే ఈ గ్రంథం సీఎం చంద్రబాబు నాయుడి వ్యక్తిత్వాన్ని, నాయకత్వాన్ని, ఆయన చేసిన సేవలను ప్రతిబింబించే విధంగా ఉందని పేర్కొన్నారు.
మంత్రి తన ప్రసంగంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ప్రశంసిస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో ఆయన పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. సీఎం నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుండటం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వాములు కావడం ప్రతి ఒక్కరికీ అదృష్టమన్నారు.
76 ఏళ్ల వయస్సులోనూ చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన దృఢ సంకల్పం, కృషి, దూరదృష్టి రాష్ట్రానికి మరింత పురోగతిని తీసుకువస్తాయని అన్నారు. అలాంటి నాయకుడిపై ఎంత సాహిత్యం వచ్చినా, ఎన్ని పుస్తకాలు రాసినా తక్కువేనని మంత్రి అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా రచయిత టీడీ ప్రసాద్ మాట్లాడుతూ, ఈ పుస్తకం ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు జీవితంలో ఉన్న పోరాటం, విజయాలు, ప్రజాసేవ పట్ల ఆయన అంకితభావాన్ని ప్రజలకు చేరవేయాలని లక్ష్యంగా పెట్టుకున్నానని తెలిపారు. ఆయన నాయకత్వం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు.
కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ జర్నలిస్టులు కూడా ఈ గ్రంథాన్ని ప్రశంసిస్తూ, రాజకీయ నాయకుల జీవితాలను ప్రతిబింబించే ఇలాంటి రచనలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా యువతకు ఇలాంటి పుస్తకాలు స్ఫూర్తినిచ్చే అంశంగా ఉంటాయని పేర్కొన్నారు.





