‘ఆపరేషన్ ఆక్టోపస్ 2.0’.. దేశవ్యాప్తంగా 52 మంది అరెస్ట్

Must read

దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న భారీ సైబర్ మోసాల నెట్‌వర్క్‌ను హైదరాబాద్​ నగర పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ‘ఆపరేషన్ ఆక్టోపస్ 2.0’ పేరుతో చేపట్టిన ఈ ప్రత్యేక దాడుల్లో భాగంగా మొత్తం 9 రాష్ట్రాల్లో సమన్వయంతో ఆపరేషన్ నిర్వహించి 52 మందిని అరెస్టు చేశారు. ఈ కేసులో బ్యాంకు అధికారుల ప్రమేయం బయటపడటం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను వీసీ సజ్జనర్​ ఆదివారం మీడియాకు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, అరెస్టయిన వారిలో 32 మంది బ్యాంకు అధికారులు ఉండటం గమనార్హం. వీరు సైబర్ నేరగాళ్లకు కీలక సహకారం అందించినట్లు పోలీసులు గుర్తించారు.

వారం రోజుల పాటు 16 ప్రత్యేక పోలీసు బృందాలు దేశంలోని పలు రాష్ట్రాల్లో సమన్వయంతో పనిచేశాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్ రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్‌ను అత్యంత రహస్యంగా నిర్వహించడం వల్ల నిందితులు తప్పించుకునే అవకాశాలు తగ్గాయని అధికారులు తెలిపారు.

అరెస్టయిన వారిలో సైబర్ నేరగాళ్లకు సహకరించిన 32 మంది బ్యాంకు అధికారులు ఉన్నారు. అదనంగా, మోసపూరిత లావాదేవీల కోసం తమ బ్యాంకు ఖాతాలను ఉపయోగించేందుకు అనుమతించిన 15 మంది మ్యూల్ ఖాతాదారులు కూడా ఉన్నారు. వీరితో పాటు, ఈ ఖాతాలను నేరగాళ్లకు అందించే ఐదుగురు మధ్యవర్తులు కూడా అరెస్టయ్యారు. ఈ ముగ్గురు వర్గాల మధ్య ఉన్న సమన్వయం వల్ల భారీ స్థాయిలో సైబర్ మోసాలు జరిగాయని పోలీసులు వెల్లడించారు.

ఈ కేసులో వివిధ బ్యాంకులకు చెందిన అధికారులు అరెస్టవడం విశేషం. IndusInd Bankకు చెందిన ఆరుగురు, బంధన్​ బ్యాంక్​, బ్యాంక్​ ఆఫ్​ బరోడా చెందిన ఐదుగురు చొప్పున, అలాగే ఫెడరల్​ బ్యాంక్​, ఐడీఎఫ్​సీ ఫస్ట్ బ్యాంక్​ లకు చెందిన నలుగురు చొప్పున అధికారులు ఉన్నారు. ఇంకా పలు ప్రైవేట్ బ్యాంకులకు చెందిన ఇతర అధికారులు కూడా ఈ కేసులో భాగమయ్యారు.

పోలీసులు నిందితుల నుంచి 26 మొబైల్ ఫోన్లు, 14 చెక్ బుక్కులు, ఒక ల్యాప్‌టాప్, 21 షెల్ కంపెనీల స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సాక్ష్యాల ఆధారంగా మరిన్ని మోసాల వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఈ నెట్‌వర్క్ ప్రధానంగా మ్యూల్ ఖాతాల ద్వారా డబ్బు బదిలీలు నిర్వహిస్తూ, షెల్ కంపెనీల పేర్లతో నకిలీ లావాదేవీలు నిర్వహించినట్లు విచారణలో వెల్లడైంది. సాధారణ ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఆన్‌లైన్ మోసాలు చేసి, ఆ డబ్బును ఈ ఖాతాల ద్వారా తరలించేవారని పోలీసులు తెలిపారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!