నగరంలో ప్రజా రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న MMTS రైళ్లలో ప్రయాణికులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలనలో ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈ అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అధికారులు వెల్లడించారు.
ఇటీవలి రోజుల్లో సోషల్ మీడియాలో ఈ ప్రతిపాదన ఇప్పటికే అమలులోకి వచ్చిందన్నట్లు ప్రచారం జరుగుతుండటంపై ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో, ఎంఎంటీఎస్ ఉచిత ప్రయాణంపై వ్యాపిస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమని పేర్కొంది.
ప్రజలు సోషల్ మీడియాలో వస్తున్న సమాచారాన్ని నమ్మే ముందు అధికారిక వనరులను పరిశీలించాలని సూచించింది. తప్పుడు ప్రచారాలను నమ్మడం వల్ల అపోహలు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
తెలంగాణ ప్రభుత్వం తరఫున పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఈ ఏడాది ఏప్రిల్ 7న ఈ ప్రతిపాదనను South Central Railwayకు పంపినట్లు తెలిపింది. ఈ ప్రతిపాదనలో నగర ప్రయాణికులకు ఉపశమనం కల్పించే దిశగా కొన్ని కీలక సూచనలు ఉన్నాయని సమాచారం.
ముఖ్యంగా రోజువారీ ఉద్యోగులు, విద్యార్థులు, సాధారణ ప్రయాణికులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కలిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.ఈ ప్రతిపాదనపై స్పందించిన రైల్వే శాఖ, పథకం అమలుకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అవగాహన ఒప్పందం (MoU) సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
ఇందులో నిబంధనలు, షరతులు, ఆర్థిక బాధ్యతలు, నిర్వహణ అంశాలు వంటి వివరాలు స్పష్టంగా ఉండాలని సూచించింది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక మాత్రమే తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని రైల్వే అధికారులు తెలిపారు.
ఈ ప్రతిపాదన అమలులోకి రావడానికి ఇంకా పలు దశలు మిగిలి ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా ఈ ప్రతిపాదనను Railway Board ఆమోదం కోసం పంపాల్సి ఉంటుందని పేర్కొంది. రైల్వే బోర్డు ఆమోదం లభించిన తరువాత మాత్రమే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.





