విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దెబ్బతీస్తున్న మాదకద్రవ్యాల సమస్యను అరికట్టేందుకు హైదరాబాద్ సిటీ పోలీస్ కీలక చర్యలు చేపట్టింది. నగరవ్యాప్తంగా శనివారం ‘ఆపరేషన్ సేఫ్ స్కూల్’ పేరుతో భారీ స్థాయిలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది.
ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం విద్యాసంస్థల పరిసరాలను పూర్తిగా వ్యసనరహితంగా మార్చడం, విద్యార్థులు చెడు అలవాట్ల బారిన పడకుండా కాపాడడం. ఇటీవల కాలంలో విద్యార్థుల్లో పొగాకు, మద్యం, డ్రగ్స్ వినియోగం పెరుగుతుండడంతో పోలీసు శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
ముఖ్యంగా పాఠశాలలు, కాలేజీల సమీపంలో లభించే పొగాకు ఉత్పత్తులు చిన్నారులను వ్యసనాల వైపు మళ్లిస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యాసంస్థల పరిసరాల్లో అక్రమంగా విక్రయిస్తున్న పొగాకు ఉత్పత్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని సజ్జనర్ నిర్ణయించారు .
ఈ నేపథ్యంలోనే దాడులు చేపట్టారు. పొగాకులోని నికోటిన్‌కు అలవాటు పడటం అనేది మాదకద్రవ్యాల వినియోగానికి తొలి మెట్టు అవుతోంది. ఒకసారి అలవాటు ఏర్పడితే, విద్యార్థులు క్రమంగా ఆల్కహాల్, డ్రగ్స్ వంటి ప్రమాదకర వ్యసనాలకు లోనయ్యే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.
ఈ అలవాట్లు వారిని మొదట చిన్నపాటి తప్పిదాల నుంచి, తరువాత తీవ్రమైన నేరాల వైపు నెట్టే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ‘ఆపరేషన్ సేఫ్ స్కూల్’ కింద పోలీసులు నగరంలోని పలు పాఠశాలలు, కాలేజీల పరిసరాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు.
అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులు, అక్రమంగా పొగాకు విక్రయిస్తున్న దుకాణాలు, అలాగే విద్యార్థులను ప్రభావితం చేసే ఇతర అంశాలపై దృష్టి సారించారు. నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై కేసులు నమోదు చేసి, తగిన చర్యలు తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. వ్యసనాల వల్ల కలిగే దుష్ప్రభావాలు, ఆరోగ్య సమస్యలు, భవిష్యత్తుపై ప్రభావం వంటి అంశాలపై వారికి వివరించారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, తమ లక్ష్యాలపై దృష్టి సారించాలని పోలీసులు సూచించారు.
ఈ డ్రైవ్ ఒక్కరోజుతో పరిమితం కాకుండా, నిరంతరం కొనసాగుతుందని. విద్యాసంస్థల పరిసరాలను పూర్తిగా సురక్షితంగా, ఆరోగ్యకరంగా మార్చే వరకు చర్యలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా పిల్లలపై నిఘా ఉంచి, వారిని సరైన మార్గంలో నడిపించాలని వారు కో రారు.





