తనపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా పరిగణించిన మంత్రి సీతక్క కీలక నిర్ణయం తీసుకున్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు ఫోన్ల పంపిణీ వ్యవహారంలో తనపై చేస్తున్న ఆరోపణలు నిరాధారమని పేర్కొంటూ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు లీగల్ నోటీసులు పంపారు.
ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం స్మార్ట్ఫోన్లను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా అంగన్వాడీ సేవలను డిజిటల్ రూపంలో మరింత సమర్థవంతంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఫోన్ల కొనుగోలు ప్రక్రియపై బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం పలు ఆరోపణలు చేస్తూ పోస్టులు పెట్టింది.
ఒక్కో ఫోన్ను మార్కెట్ ధర కంటే అధిక ధరకు కొనుగోలు చేసి మంత్రి కమీషన్లు తీసుకున్నారని బీఆర్ఎస్ శ్రేణుల ఆరోపణలు చేస్తు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసింది. ఈ ఆరోపణలను మంత్రి సీతక్క తీవ్రంగా ఖండించారు. అవి పూర్తిగా నిరాధారమైనవని, తన ప్రతిష్ఠను దెబ్బతీయడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని ఆమె మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో, పార్టీ అధినేతగా కేసీఆర్ ఈ ప్రచారానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఆయనపై నేరుగా లీగల్ నోటీసులు పంపిస్తూ, తప్పుడు ఆరోపణలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె కేసీఆర్ ను హెచ్చరించారు.
ఫోన్ల కొనుగోలు విషయంలో పూర్తి పారదర్శకత పాటించామని మంత్రి వెల్లడించారు. ఒక్కో ఫోన్ను కేవలం రూ. 11,650కే కొనుగోలు చేశామని, ఇది మార్కెట్ ధరకు అనుగుణంగానే ఉందన్నారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి టెండర్ ప్రక్రియ ద్వారా ఈ ఫోన్ల కొనుగోలు జరిగిందని ఆమె వివరించారు.
ప్రజలను తప్పుదోవ పట్టించేలా సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం చేస్తున్న బీఆర్ఎస్ నేతలపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి ప్రచారాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ఆమె అభిప్రాయపడ్డారు.





