మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్సభ, రాజ్యసభ ఫ్లోర్ లీడర్లకు లేఖ రాస్తూ కీలక పిలుపునిచ్చారు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని నిజమైన స్ఫూర్తితో అమలు చేయాల్సిన సమయం అసన్నమయ్యిందన్నారు. 2029లో జరిగే లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నుంచే ఈ రిజర్వేషన్లు అమల్లోకి తీసుకురావాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
మోదీ తన లేఖలో మహిళల రాజకీయ భాగస్వామ్యం పెరగడం దేశ ప్రజాస్వామ్యానికి మరింత బలం చేకూరుస్తుందని చెప్పారు. మహిళలు ఇప్పటికే అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటున్నారని, చట్టసభల్లో వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించడం సమాజానికి అవసరమని అభిప్రాయపడ్డారు.
నారీ శక్తి వందన్ అధినియం-2023 పార్లమెంట్ ఆమోదం పొందిన రోజు భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిందని ఆయన గుర్తు చేశారు.ఈ చట్టానికి సంబంధించిన సవరణ బిల్లులపై చర్చించేందుకు ఏప్రిల్ 16 నుంచి పార్లమెంట్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించింది.
మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో అన్ని పార్టీల ఎంపీలు పాల్గొని చర్చలో భాగస్వామ్యం కావాలని ప్రధాని కోరారు. దేశ భవిష్యత్తుకు సంబంధించిన ఈ కీలక నిర్ణయంలో అందరూ ఏకమై ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇక ఈ సమావేశాల నేపథ్యంలో బీజేపీ తన ఎంపీలకు త్రీ లైన్ విప్ జారీ చేసింది. ఏప్రిల్ 16 నుంచి 18 వరకు జరిగే ప్రత్యేక సమావేశాల్లో తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించింది. ఈ సమయంలో ఎలాంటి సెలవులు తీసుకోకుండా సభల్లో పాల్గొనాలని సూచించింది. మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లుల ఆమోదం లక్ష్యంగా ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే కేంద్ర నిర్ణయంపై ప్రతిపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ప్రధానికి లేఖ రాస్తూ పలు ప్రశ్నలు లేవనెత్తారు. ముఖ్యంగా చట్టంలో చేయబోయే సవరణలపై ముందుగా పూర్తి వివరాలు ఇవ్వకుండా ప్రత్యేక పార్లమెంట్ సమావేశం నిర్వహించడం సరైన విధానం కాదని ఆయన పేర్కొన్నారు.
నియోజకవర్గాల పునర్విభజన వంటి కీలక అంశాలపై స్పష్టత లేకుండా చర్చ జరగడం ప్రయోజనకరం కాదని ఖర్గే అభిప్రాయపడ్డారు. ఈ అంశాలపై ముందుగా అఖిలపక్ష సమావేశం నిర్వహించి అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.





