అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య చర్చలకు పాకిస్థాన్ వేదికగా నిలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పాకిస్థాన్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలకు తమ దేశం సహకారం అందించిందని తెలిపారు.
ఇస్లామాబాద్‌లో జరిగిన ఈ చర్చలు తీవ్రంగా, నిర్మాణాత్మకంగా సాగాయని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి చర్చలకు తమ దేశం ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఈ చర్చలు గత 24 గంటల పాటు కొనసాగాయని, ఇందులో పాకిస్థాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ తో పాటు ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కీలక పాత్ర పోషించారని ఇషాఖ్ దర్ వివరించారు.చర్చల ప్రక్రియ ఆదివారం ఉదయం ముగిసిందని ఆయన తెలిపారు.
ఇరుపక్షాలు కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉండాలని పాకిస్థాన్ కోరిందన్నారు.ఇక ఈ చర్చల్లో పూర్తి స్థాయి ఒప్పందం కుదరకపోయినా, కొన్ని అంశాలపై ముందడుగు పడిందని పాక్ ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. శాంతి, ప్రాంతీయ స్థిరత్వం కోసం అమెరికా, ఇరాన్‌లు సానుకూల దృక్పథంతో ముందుకు రావాలని పిలుపునిచ్చింది. పాకిస్థాన్ మధ్యవర్తిత్వాన్ని అంగీకరించినందుకు ఇరుదేశాలకు కృతజ్ఞతలు తెలిపింది.
చర్చల్లో ఇరాన్ ప్రతినిధులు తమ డిమాండ్ల విషయంలో కఠిన వైఖరి ప్రదర్శించినట్లు సమాచారం. ముఖ్యంగా 10 పాయింట్లతో కూడిన తమ ప్రతిపాదనలను అమలు చేయాలని వారు పట్టుబట్టారు. గల్ఫ్ ప్రాంతంలోని దేశాల నుంచి అమెరికా సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని, తమపై విధించిన ఆంక్షలను ఎత్తేయాలని వారు కోరారు. అలాగే హర్మూజ్ జలసంధిపై నియంత్రణ తమకే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ మాట్లాడుతూ ఈ చర్చల్లో ఒప్పందం కుదరకపోవడానికి అమెరికా విధించిన కఠిన షరతులే కారణమని ఆరోపించారు. అయితే దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. చర్చల సమయంలో ఇరుదేశాలు పరస్పరం అనేక సందేశాలు మార్పిడి చేసుకున్నాయని తెలిపారు.





