మహాత్మ జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకలు జిల్లాలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, శాసనసభ్యులు చింతా ప్రభాకర్, మున్సిపల్ చైర్పర్సన్ వనిత సంతోష్, అదనపు కలెక్టర్ పాండు తదితరులు జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నటరాజ్ థియేటర్ సమీపంలో నిర్వహించిన జయంతి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొని పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ, మహాత్మ జ్యోతిరావు పూలే సమాజంలో సమానత్వం, మహిళా విద్య కోసం చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కలగాలని ఆశించిన గొప్ప సంస్కర్తగా ఆయనను కొనియాడారు. మహిళల విద్యాభివృద్ధికి ఆయన చేసిన సేవల వల్లనే నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని పేర్కొన్నారు.
కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ, మహాత్మ జ్యోతిరావు పూలే సమానత్వం, విద్యా విస్తరణ, మహిళా సాధికారత కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడని అన్నారు.
మహిళా విద్యకు పునాది వేసిన సావిత్రిబాయి పూలే సేవలను గుర్తుచేశారు. పూలే దంపతుల స్ఫూర్తితో యువత సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.ఆయన ఆలోచనలు నేటి సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వనిత సంతోష్, అదనపు కలెక్టర్ పాండు, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి జగదీష్, వివిధ శాఖల అధికారులు, కుల సంఘాల ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, యువత, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.





