ప్రపంచ స్థాయి ఫైనాన్స్ సంస్థలు తమ గ్లోబల్ సామర్థ్య కేంద్రాలు (GCC) స్థాపించడానికి హైదరాబాద్ నగరాన్ని ప్రధాన గమ్యస్థానంగా ఎంచుకుంటున్నాయని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీదర్ బాబు వెల్లడించారు. నగరంలో అందుబాటులో ఉన్న నైపుణ్యాలు, మౌలిక సదుపాయాలు, వ్యాపార అనుకూల వాతావరణం పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని ఆయన తెలిపారు.
శనివారం బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన సమావేశంలో న్యూయార్క్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న పీకో టెక్నాలజీ సంస్థ ప్రతినిధులు మంత్రిని కలిశారు. ఈ సమావేశంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కొమటి రెడ్డి వెంకట్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
ఫైనాన్షియల్ మార్కెట్లకు సంబంధించిన సేవలు అందించే పికో టెక్నాలజీ సంస్థ, తమ అనుబంధ సంస్థ పీకో టెక్నాలజీ ఇండియా ద్వారా హైదరాబాద్లో గ్లోబల్ సామర్థ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు వారికి రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, మౌలిక సదుపాయాలు, వ్యాపార వాతావరణంపై సమగ్ర వివరాలు అందించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్ నగరంలో ఉన్న నైపుణ్యంతో కూడిన టాలెంట్ పూల్, అంతర్జాతీయ ప్రమాణాల మౌలిక వసతులు, ట్రాఫిక్ సమస్యలు తక్కువగా ఉండటం, ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే తక్కువ అద్దెలు ఉండటం వంటి అంశాలు గ్లోబల్ కంపెనీలను ఆకర్షిస్తున్నాయన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన తెలిపారు. రాబోయే 5 నుంచి 10 సంవత్సరాలు, అలాగే దీర్ఘకాలికంగా 20 సంవత్సరాల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.
ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్ ఆక్యుపెన్సీ రేటు ఎక్కువగా ఉందని మంత్రి వివరించారు. బెంగళూరు, ముంబై నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో ఆక్యుపెన్సీ సుమారు 73 శాతం ఉండగా, ముంబైలో అది కేవలం 52 శాతమేనని తెలిపారు. ఇది నగరంపై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని సూచిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
పికో టెక్నాలజీ ప్రతినిధులు కూడా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడంపై ఆసక్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఫైనాన్షియల్ టెక్నాలజీ రంగంలో తమ కార్యకలాపాలను విస్తరించడానికి ఈ నగరం అనుకూలంగా ఉందని వారు అభిప్రాయపడ్డారు.బెంగళూరు, ముంబాయి మెట్రో నగరాల్లో ట్రాఫిక్, వాయు కాలుష్యం ప్రధాన సమస్యలుగా మారినందున ఐటి సంస్థలు, జిసిసిలు హైదరాబాద్ కు తరలి వస్తున్నాయని తెలిపారు.





