మీర్జాపూర్‌లో లాయర్ దారుణ హత్య

Must read

ఉత్తరప్రదేశ్‌లో ని మీర్జాపూర్ జిల్లాలో శనివారం ఉదయం చోటుచేసుకున్న దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మార్నింగ్ వాక్‌కు వెళ్లిన ఓ సీనియర్ న్యాయవాదిని గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపడం తీవ్ర కలకలం రేపుతోంది.

పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కత్రా కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న సీనియర్ న్యాయవాది రాజీవ్ సింగ్ ప్రతిరోజు లాగానే శనివారం ఉదయం కూడా మార్నింగ్ వాక్‌కు వెళ్లారు. ఆయన రోడ్డు పక్కగా నడుచుకుంటూ వెళ్తుండగా అకస్మాత్తుగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆయనపై తుపాకి గురి పెట్టారు.

ఏమి జరుగుతుందో అర్థం చేసుకునేలోపే దుండగులు ఆయనపై కాల్పులు ప్రారంభించారు. ప్రాణభయంతో రాజీవ్ సింగ్ అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూ కొంత దూరం పరుగెత్తారు. అయితే, దుండగులు వదలకుండా వెంటాడుతూ పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో వరుసగా బుల్లెట్లు కాల్చారు.

ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన రాజీవ్ సింగ్ అక్కడికక్కడే మృతి చెందారు. భారీగా రక్తస్రావం కావడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ దారుణ హత్య జనసంచారం ఉన్న ప్రాంతంలోనే జరగడం స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేసింది.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు అక్కడి ఆధారాలను సేకరిస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈ ఘటనపై మీర్జాపూర్ బార్ అసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయవాదిపై జరిగిన ఈ హత్యను ఖండిస్తూ వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. అదే సమయంలో న్యాయవాదులు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. హత్యకు గల కారణాలు బయటపెట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

స్థానికంగా శాంతిభద్రతలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటన వెనుక వ్యక్తిగత వైరం, ప్రొఫెషనల్ రైవల్రీ లేదా ఇతర కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!