అల్లూరి సీతారామరాజు జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. సెల్ఫీలు, ఫొటోలు తీసుకునే సరదా ముగ్గురు యువతుల ప్రాణాలను బలిగొన్నది. ఈ విషాదం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పండుగ సెలవులను ఆనందంగా గడపాలని వెళ్లిన ఈ బాలికలు, మృతి చెందడం కుటుంబ సభ్యులను శోక సంద్రంలో ముంచింది.
వివరాల్లోకి వెళ్తే, హుకుంపేట మండలం బుర్జ పంచాయతీ పరిధిలోని జంబవలస గ్రామానికి చెందిన ఐదుగురు యువతులు సమీపంలోని ముల్లుంగుమ్మి జలపాతాన్ని సందర్శించేందుకు వెళ్లారు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, సరదాగా ఫొటోలు, సెల్ఫీ వీడియోలు తీసుకుంటూ గడుపుతున్నారు.
ఈ క్రమంలో త్రిష (17), రత్న కుమారి (16), పవిత్ర (16) అనే ముగ్గురు యువతులు జలపాతం మధ్యలో ఉన్న ఓ పెద్ద బండరాయిపైకి ఎక్కారు. అక్కడ నుంచి ఫొటోలు తీసుకుంటూ ఆనందంగా గడుపుతుండగా ఒక్కసారిగా విషాదం చోటుచేసుకుంది.
బండరాయి తడిగా ఉండటంతో వారి కాళ్లు జారి, నీటి ప్రవాహంలో పడిపోయారు. అక్కడి ప్రవాహం బలంగా ఉండటంతో వారు బయటపడలేకపోయారు. తోటి స్నేహితులు, స్థానికులు వారిని రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. కొంతసేపటి తర్వాత ముగ్గురు బాలికల మృతదేహాలను వెలికితీశారు.
ఈ విషాదం తెలిసిన వెంటనే గ్రామంలో తీవ్ర శోకసంద్రం నెలకొంది. తమ కళ్లముందే పెరిగిన పిల్లలు ఇలా ఆకస్మికంగా ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పండుగ రోజున ఇలాంటి ఘటన జరగడం గ్రామస్తులను తీవ్ర ఆందోళనకు గురించేసింది.
సెల్ఫీల మోజు ఎంత ప్రమాదకరమో గుర్తుచేసింది. ముఖ్యంగా జలపాతాలు, కొండలు, సముద్ర తీర ప్రాంతాలు వంటి ప్రమాదకర ప్రదేశాల్లో ఫొటోలు తీసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ప్రమాదకరమైన ప్రదేశాల్లోకి వెళ్లి ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు పోలీసు బందోబస్తు పెంచి భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయాలని స్థానికులు కోరుతున్నారు.





