బంగారం, వెండి ధరలు దేశవ్యాప్తంగా భారీగా పెరిగాయి. ముఖ్యంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, అలాగే యునైటేడ్ స్టేట్, ఇరాన్ మధ్య తాత్కాలిక యుద్ధ విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో విలువైన లోహాల మార్కెట్‌లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి.
యుద్ధం కారణంగా గత కొన్ని రోజులుగా భయాందోళనల మధ్య హెచ్చుతగ్గులు ఎదుర్కొన్న బంగారం, వెండి ధరలు ఇప్పుడు ఒక్కసారిగా పెరుగుదల దిశగా పయనించాయి. పెట్టుబడిదారులు మళ్లీ ఈ లోహాలపై దృష్టి సారించడ మొదలు పెట్టారు. గ్లోబల్ మార్కెట్లలో స్థిరత్వం రావడం ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలు.
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక్కసారిగా రూ.3,650 వరకు పెరిగింది. అదే విధంగా వెండి ధరలు కూడా భారీగా పెరిగి కిలోకు రూ.10 వేలకు పైగా పెరుగుదల నమోదు చేశాయి. ఈ మార్పులు వినియోగదారులు, వ్యాపార వర్గాలను ఆశ్చర్యానికి గురిచేశాయి.
హైదరాబాద్ నగరంలో బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,53,800కు చేరుకోగా, 22 క్యారెట్ల పసిడి ధర రూ.2,999 పెరిగి రూ.1,41,000కు చేరుకుంది. ఇది ఇటీవల కాలంలో గరిష్ట స్థాయిలలో ఒకటిగా భావిస్తున్నారు. వెండి ధర రూ.10 వేల పెరుగుదలతో రూ.2.65 లక్షలకు చేరుకుంది. వెండి ధరల పెరుగుదల పరిశ్రమలపై కూడా ప్రభావం చూపే అవకాశముంది.
ఇక దేశ రాజధాని న్యూఢిల్లిలో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. అక్కడ 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,970 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,41,150 వద్ద ఉంది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు దాదాపు ఒకే విధంగా పెరుగాయి.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు, ముఖ్యంగా యుద్ధాలు, ఉద్రిక్తతలు వంటి అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. ప్రస్తుతం అమెరికా–ఇరాన్ మధ్య యుద్ధ విరమణతో కొంత స్థిరత్వం వచ్చినప్పటికీ, భవిష్యత్తు పరిస్థితులు ఎలా మారుతాయన్న దానిపై ఆధారపడి ధరల్లో మరింత మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.





