ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి రాజధాని అంశం మరో కీలక మలుపు తిరిగిన నేపథ్యంలో, ఆ ప్రాంత రైతులు, మహిళలు భక్తి, ఆనందంతో ప్రత్యేక యాత్ర చేపట్టారు. అమరావతికి చట్టబద్ధ గుర్తింపు లభించడంతో వారు తమ ఇష్టదైవమైన కనకదుర్గమ్మ దేవాలయం వద్ద మొక్కులు చెల్లించేందుకు కాలినడకన భారీగా తరలివచ్చారు.
అమరావతి రాజధానిగా గుర్తింపు పొందడమే కాకుండా, అభివృద్ధి పనులు వేగవంతం కావడంతో రైతుల్లో నూతన ఆశలను నింపింది. గత కొన్నేళ్లుగా రాజధాని కోసం పోరాటం చేస్తున్న రైతులు ఈ పరిణామాన్ని విజయం గా భావిస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ ఆనందాన్ని దేవుడికి అర్పించాలనే ఉద్దేశంతో మహిళలు, వృద్ధులు, యువత కలిసి పెద్ద ఎత్తున యాత్ర చేపట్టారు.
వారి యాత్రలో భక్తి స్పూర్తి స్పష్టంగా కనిపించింది. కొందరు రైతులు చేతుల్లో పూజా సామగ్రి, కొబ్బరికాయలు, పసుపు-కుంకుమ తీసుకుని నడుస్తుండగా, మహిళలు హరతులు పట్టుకుని భజనలు చేస్తూ ముందుకు సాగారు. “అమరావతి అభివృద్ధి చెందాలి”, “రైతులకు న్యాయం జరగాలి” అనే నినాదాలతో అక్కడి ప్రాంతం మారుమ్రోగింది.
ఈ యాత్రలో పాల్గొన్న మహిళలు మాట్లాడుతూ, తమ భూములను రాజధాని కోసం ఇచ్చినప్పుడు ఎదురైన అనిశ్చితి, కష్టాలను గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు చట్టబద్ధ గుర్తింపు రావడం తమకు న్యాయం జరిగినట్టేనని భావిస్తున్నారు. అందుకే అమ్మవారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలని నిర్ణయించుకున్నామని వారు తెలిపారు.
విజయవాడ చేరుకున్న అనంతరం భక్తులు కనకదుర్గమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో నైవేద్యాలు సమర్పించి, తమ కోరికలు నెరవేరినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది.
ఈ సందర్భంగా కొంతమంది రైతు నాయకులు మాట్లాడుతూ, అమరావతి అభివృద్ధి వేగంగా సాగాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు చేయాలని కోరారు. రాజధాని నిర్మాణం పూర్తయితే ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందుతుందని వారు అభిప్రాయపడ్డారు.
ఈ యాత్ర భక్తి, భావోద్వేగం, ఆశల కలయికగా నిలిచింది. అమరావతి రైతుల పోరాటానికి ఇది ఒక మైలురాయిగా మారిందని వారు పేర్కోన్నారు.





