రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి అంశంపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన పూర్తిగా విధ్వంసానికి ప్రతీకగా నిలిచిందని విమర్శించిన ఆయన, ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతి పునర్నిర్మాణం వేగంగా ముందుకు సాగుతోందని తెలిపారు.శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలకు తెలియజేయడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. గత వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సవాలు జరుపుకుంటున్నారని చెప్పారు.
స్వతంత్ర భారతదేశంలో ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్, అయోధ్య రామ మందిరం, CAA వంటి కీలక అంశాలపై రాజకీయ పార్టీల మధ్య విభేదాలు ఉన్నాయని గుర్తుచేశారు. అయితే అమరావతి చట్టబద్ధత విషయంలో దేశంలోని 50కి పైగా రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయని, కేవలం వైసీపీ మాత్రమే వ్యతిరేకించిందని విమర్శించారు.తెలుగు జాతి రాజధాని అమరావతిపై జగన్‌కు ఉన్న వైఖరి చరిత్ర చూస్తే అర్థమవుతుందని అచ్చెన్నాయుడు అన్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజల అభివృద్ధినే దృష్టిలో పెట్టుకుని పనిచేశారని తెలిపారు.
2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో కూడా రెండు రాష్ట్రాలకు నష్టం జరగకుండా చంద్రబాబు పోరాడారని పేర్కొన్నారు. అనంతరం అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకుని అమరావతిని రాజధానిగా ప్రకటించారని చెప్పారు. ఆ సమయంలో వైసీపీ కూడా పూర్తి మద్దతు తెలిపిందని గుర్తు చేశారు.అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మాట మార్చి అమరావతిని దూషించారని, మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించారని ఆరోపించారు. అమరావతిలో అవినీతి జరిగిందని చెప్పినా ఒక్కటి కూడా నిరూపించలేకపోయారని విమర్శించారు.
అమరావతిని నమ్మి సుమారు 29 వేల మంది రైతులు 34 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని, ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ కావడంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం లేదని తెలిపారు. 2014-2019 మధ్య టీడీపీ పాలనలో భారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు.2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం 18 నెలల్లోనే అమరావతి అభివృద్ధి పనులు మళ్లీ ప్రారంభమయ్యాయని తెలిపారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్, మూలపేట పోర్ట్ నిర్మాణం, కొత్త పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకువస్తున్నామని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, త్వరలోనే దేశానికి అంకితం చేస్తామని తెలిపారు.
రాయలసీమలో కూడా లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వేగవంతం చేసి కుప్పం వరకు నీరు తీసుకువచ్చామని పేర్కొన్నారు. వైసీపీ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని, ప్రజలు ప్రశ్నిస్తే వారు రాజకీయాల్లో నిలవలేరని హెచ్చరించారు.





